సలార్ 2: ఇప్పట్లో లేనట్లేనా..?

శౌర్యంగపర్వం కథను తెలుసుకోడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Update: 2024-10-30 12:38 GMT

రెబల్ స్టార్ ప్రభాస్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'సలార్'. గతేడాది క్రిస్మస్ సందర్భంగా వచ్చిన ఈ యాక్షన్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. దీంతో 'సలార్' పార్ట్-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శౌర్యంగపర్వం కథను తెలుసుకోడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ - ప్రశాంత్ ఇతర కమిట్మెంట్స్ చూస్తుంటే, ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ ఇప్పట్లో రావడం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది.

నిజానికి 'సలార్ 1' రిలీజైన వెంటనే 'సలార్ 2' సినిమా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అప్పుడెప్పుడో కమిటైన ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాల్సిన అవసరం ఏర్పడింది. 2024 మార్చిలోనే NTRNeel సినిమా ప్రారంభం అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత ఆగస్టులో షూటింగ్ అన్నారు. కొన్ని రోజుల కిందట ఈ సినిమా అట్టహాసంగా మొదలైంది. ఆ వెంటనే రెగ్యులర్ షూట్ కు వెళ్తారని అన్నారు కానీ, అలా జరగలేదు. అక్టోబర్ నెల కూడా గడిచిపోయింది కానీ సెట్స్ మీదకు వెళ్ళలేదు.

NTRNeel సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అంతా ఆలోచిస్తున్న టైంలో, సడన్ గా 'సలార్ 2' షూటింగ్ మొదలైందనే ఓ న్యూస్ వచ్చింది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా చిత్రీకరణ ప్రారంభించారని, 20 రోజుల పాటు ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్ లో హీరో కూడా పాల్గొంటారని అన్నారు. బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు దీని గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు కానీ, ప్రొడక్షన్ హౌస్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అభిమానులు కాస్త గందరగోళానికి గురయ్యారు.

అయితే 'సలార్ 2' షూటింగ్ ప్రారంభం కాలేదని, ప్రభాస్ సినిమా అసలు సెట్స్‌పైకి రాలేదనే టాక్ వచ్చింది. ప్రభాస్ ప్రస్తుతం మారుతీతో 'ది రాజా సాబ్', హను రాఘవపూడితో 'ఫౌజీ' సినిమాలను పూర్తి చేయడంపైనే దృష్టి పెట్టాడని తెలుస్తోంది. అలానే ప్రశాంత్ నీల్ పూర్తిగా ఎన్టీఆర్ సినిమాపైనే ఫోకస్ పెట్టారని అంటున్నారు. ఈ నెలలో ఒక షెడ్యూల్ పెట్టుకోడానికి రెడీ అయ్యారు కానీ, కుదరలేదు. తారక్ 'వార్ 2' సినిమా సెట్స్ లో అడుగుపెట్టడమే దీనికి కారణం. లుక్ విషయంలో తేడాలు రాకూడదని ముందుగా హిందీ సినిమా షెడ్యూల్ కంప్లీట్ చేయాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారట.

ఎన్టీఆర్-నీల్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకు వెళ్తుందని, ఏడాది పాటు నిర్విరామంగా షూటింగ్ జరుపుకొని 2026 సంక్రాంతికి సిద్ధం అవుతుందని అంటున్నారు. ఇది పూర్తైన వెంటనే ప్రశాంత్ నీల్ తన దృష్టిని 'KGF: చాప్టర్ 3' వైపు మళ్లిస్తాడని టాక్ నడుస్తోంది. అప్పటికి యష్ కూడా 'టాక్సిక్' 'రామాయణం' సినిమాలను పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఇప్పట్లో 'సలార్ 2' సెట్స్ మీదకు వచ్చే అవకాశం లేనట్లే. ఎందుకంటే 'KGF 3' కోసం నీల్ ఇంకెంత టైం తీసుకుంటారో చెప్పలేం.

ఇదిలా ఉంటే 'సలార్ 2' షూట్ జరుగుతున్న మాట వాస్తవమేని, ఇప్పుడు ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని మరో వార్త కూడా వినిపిస్తోంది. సినిమా లేట్ అయ్యేకొద్దీ ప్రభాస్ - పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రల్లో నటించిన బాల నటులు పెరిగి పెద్దయ్యే ఛాన్స్ ఉందని, ముందుగా చైల్డ్ హుడ్ పోర్షన్ ను షూట్ చేస్తున్నారని అంటున్నారు. ఇలా 'సలార్' రెండో భాగంపై రెండు వేర్వేరు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మరి త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Tags:    

Similar News