టాలీవుడ్ ను సరిగ్గా వాడుకుంటున్న రెండు ప్రభుత్వాలు!
ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ రెండు గవర్నమెంట్స్ తో కలిసి పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి అంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రం హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. భవిష్యత్ లో ఎలా ఉంటుందో తెలియదు కానీ, ఇప్పటికైతే ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది. అయినా సరే అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో సినీ ప్రముఖులు సఖ్యతగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఏవైనా సమస్యలు వస్తే, ఎవరు అధికారంలో ఉంటే వారితో మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కరించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ రెండు గవర్నమెంట్స్ తో కలిసి పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణా ప్రభుత్వం ఇటీవల కాలంలో మాదక ద్రవ్యాల వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ రహిత సమాజమే తమ లక్ష్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ మీద దృష్టి పెట్టింది. ఫేక్ ప్రచారం, అసహ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోడానికి సిద్ధమైంది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలు చేపట్టిన కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి, సెలబ్రిటీలతో ప్రచారం చేయించాలని నిర్ణయించుకున్నారు.
కొత్త సినిమాల విడుదలకు ముందే హీరోలు డ్రగ్స్‌పై అవగాహన కల్పించే వీడియోలు చేయాలని రేవంత్ రెడ్డి హితవు పలికిన సంగతి తెలిసిందే. ఇటీవల సినీ ప్రముఖులతో జరిగిన భేటీలోనూ తెలంగాణ సీఎం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సినీ ఇండస్ట్రీ, ప్రభుత్వం కలిసి పని చేయబోతున్నట్లు ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. ఇప్పటికే ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలు కావొద్దని పిలుపునిస్తూ వీడియో సందేశాలు విడుదల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియాలో ద్వేషపూరితమైన పోస్టులు, నకిలీ వార్తలను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సినీ ప్రముఖులతో అవగాహనా వీడియోలు చేయిస్తున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోలు నిఖిల్ సిద్ధార్థ, అడివి శేష్, హీరోయిన్లు శ్రీ లీల, మీనాక్షి చౌదరీ లాంటి పలువురు ఇప్పటికే ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేయొద్దని, సోషల్ మీడియాని దుర్వినియోగపరచవద్దని చెబుతూ వీడియో బైట్స్ రిలీజ్ చేసారు.
ఇలా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తాము చేపట్టే సామాజిక కార్యక్రమాలపై జనాలకు అవగాహన కల్పించడానికి టాలీవుడ్ ఇండస్ట్రీని ఉపయోగించుకుంటున్నారు. సెలబ్రిటీలు చెబితే ఏవైనా మేసేజ్ లు జనాల్లోకి చాలా త్వరగా, బలంగా వెళ్తాయి కాబట్టి ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. గతంలో ఉమ్మడి అంధ్రప్రదేశ్ లోనూ ఎయిడ్స్, పోలియో నిర్మూలన ప్రోగ్రామ్స్ కు హీరో హీరోయిన్లు సపోర్టుగా నిలిచారు. ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు సినిమా వాళ్ళు తమవంతు మద్దతు అందిస్తున్నారు.