విశాల్‌ హెల్త్‌ పుకార్లు... అసలు విషయం ఏంటంటే!

ఒక సినిమా సెట్స్ పై ఉన్నా ఎప్పుడు ఆ సినిమా వచ్చేది ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వడం లేదు.

Update: 2025-01-06 05:55 GMT

కెరీర్‌ ఆరంభంలో ఏడాదికి మూడు అంతకంటే ఎక్కువ సినిమాలు చేసిన విశాల్‌ ఆ తర్వాత ఏడాది రెండు సినిమాలు చొప్పున చేసుకుంటూ వచ్చాడు. కానీ గడచిన రెండేళ్లుగా ఆయన నుంచి పెద్దగా సినిమాలు రావడం లేదు. 2023లో మార్క్ ఆంటోనీ విడుదల కాగా, 2024లో రత్నం సినిమా వచ్చింది. ఈ ఏడాది ఆయన నుంచి సినిమా ఉంటుందా అనే అనుమానాలు ఉన్న సమయంలో ఎప్పుడో 12 ఏళ్ల క్రితం ఆగిపోయిన సినిమా అయిన మధగజ రాజా ను విడుదల చేయబోతున్నారు. ఇది కాకుండా మరో సినిమా ఈ ఏడాదిలో ఆయన నుంచి వస్తుందా అంటే స్పష్టత లేదు. ఒక సినిమా సెట్స్ పై ఉన్నా ఎప్పుడు ఆ సినిమా వచ్చేది ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వడం లేదు.

విశాల్‌ ఎందుకు స్లో అయ్యారు, భారీ సినిమాలు ఏమైనా చేస్తున్నారా అంటే లేదు. అయినా ఎందుకు ఆయన నుంచి సినిమాలు రావడం లేదు అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన మధగజ రాజా సినిమా ప్రమోషన్‌ వేడుకలో పాల్గొన్న సమయంలో చాలా సన్నబడి, మాట్లాడానికి, నిలబడ్డానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో విశాల్ ఆరోగ్యం గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా తమిళ మీడియాలో విశాల్ ఆరోగ్యం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు కథనాలు రాస్తున్నారు. ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు, షూటింగ్‌లో పాల్గొనడానికి ఆరోగ్యం సహకరించడం లేదు అంటూ ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకుంటూ ఉన్నారు.

తమిళ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. విశాల్‌ సినిమాలు తక్కువ చేయడంకు కారణం ఆయన ఇతర బాధ్యతలు నెత్తిన వేసుకోవడం. విశాల్‌ సినిమాలు మాత్రమే కాకుండా పలు పనుల్లో బిజీగా ఉంటున్నారు. ఇక ఆయన లుక్ మారడం వెనుక కారణం ఉందని సన్నిహితులు అంటున్నారు. రాబోయే సినిమా కోసం బరువు తగ్గారని, అంతే తప్ప అనారోగ్య సమస్యల వల్ల బరువు తగ్గలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక మధగజ రాజా సినిమా ఈవెంట్‌లో విశాల్‌ మాట్లాడేందుకు, నిల్చునేందుకు ఇబ్బంది పడ్డాడు. అందుకు కారణం ఆయన ఆ సమయంలో తీవ్రమైన చలి జ్వరంతో బాధ పడుతున్నారు.

ఆ చలి జ్వరం కారణంగానే ఆయన చేతులు కాస్త వణికినట్లుగా అనిపించాయి. అంతే కాకుండా ఆయన నీరసంగా ఉండటం వల్ల నిల్చోవడంకు ఇబ్బంది పడ్డారు. గత రెండు మూడు రోజులుగానే ఆయన జ్వరంతో బాధ పడుతున్నారని, ఒకటి రెండు రోజుల్లో ఆయన పూర్తిగా ఆరోగ్యంతో మన ముందుకు వస్తారు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇండస్ట్రీలో కొందరు విశాల్‌ గురించి తప్పుడు వార్తలు పుట్టిస్తున్నారు అంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. విశాల్‌ ముందు ముందు మళ్లీ మాస్‌ సినిమాలతో ప్రేక్షకులను అలరించడం ఖాయం అన్నారు. సంక్రాంతికి రాబోతున్న మధగజ రాజా సినిమాలో విశాల్‌ కి జోడీగా వరలక్ష్మి శరత్‌ కుమార్‌, అంజలి నటించారు. ఈ సినిమా 12 ఏళ్ల క్రితం పూర్తి అయినా ఏవో కారణాల వల్ల వాయిదా పడింది. తమిళంలో మాత్రమే ఈ సినిమా విడుదల కాబోతుంది.

Tags:    

Similar News