ఎంపురాన్ వివాదం వేళ..పృథ్వీరాజ్ కు మరో బిగ్ షాక్
మాలీవుడ్ స్టార్ నటుడు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ పృథ్వీరాజ్ సుకుమారన్.. దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ L2:ఎంపురాన్ పై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.;

మాలీవుడ్ స్టార్ నటుడు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ పృథ్వీరాజ్ సుకుమారన్.. దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ L2:ఎంపురాన్ పై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ విషయంపై సినిమాలో లీడ్ రోల్ పోషించిన స్టార్ హీరో మోహన్ లాల్ క్షమాపణలు చెప్పారు. మేకర్స్ సినిమాలో కొన్ని కట్స్ చేశారు. రీసెంట్ గా పృథ్వీరాజ్ తల్లి కూడా స్పందించారు.
అయితే తాజాగా పృథ్వీరాజ్ కు ఆదాయపు పన్ను శాఖ.. నోటీసులు జారీ చేసింది. ఇటీవల సంవత్సరాల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ తీసిన చిత్రాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో నోటీసులు అందాయి. కడువ, జనగణమన, గోల్డ్ చిత్రాల పారితోషికానికి సంబంధించిన సమాచారం అందించాలని ఐటీ శాఖ ఆ నోటీసుల్లో పేర్కొంది.
ఇది ఒక సాధారణ ప్రక్రియ అని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. గత నెల 29న పృథ్వీరాజ్ కు ఈ మెయిల్ ద్వారా నోటీసు అందగా, ఏప్రిల్ 29వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే కడువ, జనగణమన, గోల్డ్ చిత్రాలకు పృథ్వీరాజ్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని సమాచారం. సహ నిర్మాతగా కొంత పర్సంటేజ్ అందుకున్నారని వినికిడి.
అయితే ఎంపురాన్ నిర్మాత, ప్రముఖ పారిశ్రామికవేత్త గోకులం గోపాలన్ చిట్ ఫండ్ కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్- ఈడీ శుక్రవారం దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. కేరళతోపాటు చెన్నైలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. 14 గంటలపాటు అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి తర్వాత ముగించినట్లు సమాచారం.
అదే సమయంలో గోపాలన్ ను కొన్ని గంటలపాటు ఈడీ అధికారులు నిన్న సాయంత్రం ప్రశ్నించారట. అనంతరం రూ.1.5 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరిన్ని పత్రాలు అందించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. ఈ వివాదం నెలకొన్న వేళ.. పృథ్వీరాజ్ కు నోటీసులు అందిన విషయం బయటకు వచ్చింది.
అయితే ఈడీ దాడులకు.. పృథ్వీరాజ్ కు వచ్చిన ఐటీ నోటీసులకు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. కేవలం ఆయన గత చిత్రాల రెమ్యునరేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు అడిగినట్లు సమాచారం. ఐటీ శాఖ కూడా ఇది సాధారణ ప్రక్రియ అని చెబుతోంది. మరి ఈ విషయంపై పృథ్వీరాజ్ ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. చూడాలి స్పందిస్తారో.. లేదో..