మంజుమ్మెల్ బాయ్స్ పన్ను ఎగవేత స్కాం
సినిమాకు పెట్టిన పెట్టుబడికి దాదాపు పది రెట్లు లాభాలు వచ్చినట్లుగా టాక్ వినిపించింది.
ఈ ఏడాది ఆరంభంలో మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన 'మంజుమ్మెల్ బాయ్స్'ని దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆధరించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా రూ.250 కోట్ల వసూళ్లు నమోదు చేసింది అంటూ మలయాళ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సినిమాకు పెట్టిన పెట్టుబడికి దాదాపు పది రెట్లు లాభాలు వచ్చినట్లుగా టాక్ వినిపించింది. సినిమా విడుదల తర్వాత పలు వివాదాలు ఈ సినిమాను చుట్టు ముట్టాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి ఈ సినిమా నిర్మాణంలో తాను భాగస్వామినే అని, కానీ తనకు రావాల్సిన లాభాల వాటాను ఇవ్వడం లేదు అంటూ కోర్టును ఆశ్రయించడం జరిగింది.
మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతలకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి ఈ సినిమా గురించిన వార్తలు వస్తున్నాయి. సినిమాకు వచ్చిన లాభాలకు, నిర్మాతలు చెల్లించిన పన్నుకు సంబంధం లేకుండా ఉందని, మీడియా ద్వారా సినిమాకు భారీ మొత్తంలో లాభాలు వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. కానీ నిర్మాతలు ఇప్పటి వరకు మినిమం ట్యాక్స్ సైతం చెల్లించలేదు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా చిత్ర నిర్మాత ఆఫీస్లపై ఐటీ అధికారులు దాడులు చేయడం జరిగింది.
కేరళలోని కొచ్చిలో ఉన్న ఈ సినిమా నిర్మాణ సంస్థ ఆఫీస్‌పై ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్లుగా మలయాళ మీడియాలో వార్త కథనాలు వస్తున్నాయి. నిర్మాతల ఆఫీస్‌లను తనికీలు చేసిన ఐటీ అధికారులు ఏం గుర్తించారు అనే విషయమై అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ నిర్మాతలు పెద్ద మొత్తంలో పన్ను ఎగవేశారు అంటూ ఐటీ అధికారులు గుర్తించారు అంటూ వార్తలు వస్తున్నాయి. సినిమా చిన్న బడ్జెట్‌తో రూపొందించి పెద్ద మొత్తంలో లాభాలను దక్కించుకోవడంతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను సైతం భారీ మొత్తంలో ఉంటుంది. కానీ నిర్మాతలు చెల్లించలేదు.
పది మంది స్నేహితులు ఒక ట్రిప్‌కు వెళ్లిన సమయంలో అందులో ఒకతను ప్రమాదవశాత్తు గుహలోని లోయలో పడిపోతాడు. దాంతో స్నేహితులు అంతా కలిసి అతడిని ఎలా కాపాడారు అనేది సినిమా కథాంశం. ఇది నిజ జీవితంలో సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా. సౌబిన్ షాహిర్ కీలక పాత్రలో నటించడంతో పాటు నిర్మాతల్లో ఒకడిగా వ్యవహరించాడు. ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ లో ప్రముఖంగా చూస్తున్న సినిమాగా నిలిచింది. ఈ ఏడాది ఆరంభం నుంచి మొదలుకుని చివరి వరకు ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉండటం ఈ సినిమా ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.