టాలీవుడ్ ఐటి రెయిడ్స్ రౌండప్.. ఇది కూడా బిగ్గెస్ట్ రికార్డ్!

దాదాపు వందమంది ఈ సోదాలు 4 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Update: 2025-01-21 13:00 GMT

తెలుగు సినిమా పరిశ్రమలో ఆదాయపు పన్ను శాఖ దాడులు ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇది చాలా సాధారణం అనిపించినా, ఈసారి జరిగిన దాడులు పెద్ద ఎత్తున సంచలనం రేపాయి. గతంలో ఎప్పుడు లేనంత ఎక్కువమంది ఐటి అధికారులు సోదాలు నిర్వహిడం విశేషం. దాదాపు వందమంది ఈ సోదాలు 4 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాబట్టి టాలీవుడ్ చరిత్రలోనే ఇది బిగ్గెస్ట్ ఐటి రెయిడ్ రికార్డ్ అని చెప్పవచ్చు.

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతలు, వారి కుటుంబ సభ్యులు, కార్యాలయాలు, అలాగే అగ్రస్థాయి ఫైనాన్షియర్లపై జరిగిన ఈ దాడులు పరిశ్రమలో మరింత లోతైన ఆర్థిక వ్యవస్థను వెలుగులోకి తెచ్చాయి. ముఖ్యంగా దిల్‌ రాజు, మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాత నవీన్‌, అభిషేక్ అగర్వాల్ వంటి పెద్ద పేర్లను ఈ దాడులు స్పృశించాయి.

మైత్రి మూవీ మేకర్స్‌కు అర్థిక సాయాన్ని అందించిన వెంకట సతీష్ కిలారు వంటి నూతన నిర్మాతలపైనా కూడా దాడులు జరిపారు. ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చి బాబు కాంబినేషన్‌లో కొత్త సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక వీరి ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, పన్నుల చెల్లింపుల నిబద్ధతను పరిశీలిస్తున్నారు. ఈ దాడులు కేవలం ప్రొడక్షన్ హౌస్‌లు మాత్రమే కాకుండా, ఫైనాన్సింగ్ పద్ధతులపై మరింత స్పష్టత తీసుకొస్తున్నాయి.

ప్రముఖ ఫైనాన్షియర్ సత్య రంగయ్య పేరు కూడా ఈ దాడుల్లో ప్రధానంగా వినిపిస్తోంది. దశాబ్దాలుగా టాలీవుడ్‌ పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్న సత్య రంగయ్య, నిర్మాతలకు ప్రాధాన్యతను అందించే వ్యక్తిగా నిలిచారు. అయితే, అతని వ్యవహారాలను పన్ను అధికారులు పరిశీలించడం పరిశ్రమలో ఆర్థిక నిర్వహణ పట్ల జాగ్రత్తల అవసరాన్ని సూచిస్తోంది.

రిలయన్స్‌ శ్రీధర్‌ వంటి ఆర్థిక మేధావులపైనా కూడా దాడులు జరిపారు. గతంలో అనేక పెద్ద బడ్జెట్‌ సినిమాలను విజయవంతంగా నిర్వహించిన శ్రీధర్‌ వ్యవహారాలు కూడా విచారణలో భాగమయ్యాయి. ఐటీ అధికారులు ఈ దాడుల ద్వారా పెద్ద బడ్జెట్‌ సినిమాలకు సంబంధించి పన్నుల చెల్లింపుల విధానాలను పరిశీలిస్తున్నారు. టాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో భారీ బడ్జెట్‌ సినిమాల నిర్మాణం పెరుగుతున్న నేపధ్యంలో, ఈ దాడులు మరింత ఆసక్తికరంగా మారాయి.

పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం చేసే పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు, ఫైనాన్సింగ్ పద్ధతులు మరింత పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రొడక్షన్ హౌస్‌లు, ఫైనాన్షియర్ల మధ్య వ్యవహారాలను మరింత స్పష్టతతో నిర్వహించడం వలన పరిశ్రమ నిబద్ధతను పెంచుకోవచ్చు. ఇటువంటి దాడులు పరిశ్రమలో ఆర్థిక పారదర్శకతను తీసుకురావడమే కాకుండా, దాగుడుమూతలు ఆడే లావాదేవీలకు పుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంది. పన్ను చెల్లింపుల్లో అవకతవకలు తగ్గిపోవడం మాత్రమే కాకుండా, సమర్థమైన ఆర్థిక వ్యవస్థ ద్వారా పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ దాడులు టాలీవుడ్‌లో ఆర్థిక వ్యవస్థకు గుణపాఠంగా నిలుస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News