ఐటీ రైడ్స్: సుకుమార్ పై స్పెషల్ ఫోకస్ ఎందుకంటే..?

తెలుగు చిత్ర పరిశ్రమలోని పలు ప్రొడక్షన్ హౌస్‌లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే.

Update: 2025-01-22 19:19 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలోని పలు ప్రొడక్షన్ హౌస్‌లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్ తో పాటుగా పలువురు నిర్మాతలు, ఫైనాన్సియర్స్ పై రైడ్స్ నిర్వహించారు. అయితే డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారనే విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం నుంచే ఆయన నివాసంలో తనిఖీలు జరుగుతుండగా.. ఈ విషయం బుధవారం ఉదయం బయిటకు వచ్చింది.

సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై 'పుష్ప 2' సినిమా రూపొందింది. నిర్మాతలతో పాటుగా దర్శకుడిపై కూడా ఐటీ దాడులు చేయడానికి కారణం.. ఆయన సినిమా నిర్మాణంలోనూ భాగం పంచుకోవడమే అని తెలుస్తోంది. మైత్రీ నిర్మాతలతో సుక్కూకి మంచి సాన్నిహిత్యం ఉంది. నవీన్ యెర్నేని, రవి శంకర్ నిర్మించే సినిమాలకు సుకుమార్ నిర్మాణ భాగస్వామిగా ఉంటూ వస్తున్నారు. అందుకే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌ ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు.

సుకుమార్ దర్శకత్వం వహించే చిత్రాలతో పాటుగా, అప్పుడప్పుడు మైత్రీ టీమ్ నిర్మించే ఇతర సినిమాలకు కూడా ఆయన పేరు మీదుగా పెట్టుబడులు పెడుతున్నారు. 'పుష్ప 2' సినిమా కోసం దర్శకుడు భారీ రెమ్యూనరేషన్ తీసుకోవడమే కాకుండా.. సినిమాకి వచ్చిన లాభాల్లోనూ వాటా తీసుకున్నట్లుగా టాక్ ఉంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌ బ్యానర్ లో రూపొందనున్న 'RC 16' ప్రొడక్షన్‌లోనూ సుకుమార్ రైటింగ్స్ కు భాగం ఉంది. దీని తర్వాత రామ్ చరణ్ తో చేయబోయే 'RC 17' ప్రాజెక్ట్ నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉంటారు.

ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సహకారం గురించి.. ఇరు సంస్థల మధ్య ఆర్థిక వ్యవహారాలపై ఐటీ అధికారులు ఆరాలు తీసినట్లుగా వార్తలు వస్తున్నాయి. బ్యాంకు లావాదేవీలు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కు సంబంధించిన వివిధ డాక్యుమెంట్స్ ను పరిశీలించినట్లుగా తెలుస్తోంది. పుష్ప 2' సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.1831 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీన్ని నిర్ధారించే ఫైల్స్, ఐటీ రిటర్న్స్ ను కూడా అధికారులు నిశితంగా పరిశీలించారని అంటున్నారు.

సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి తెరంగేట్రం చేస్తున్న ''గాంధీ తాత చెట్టు" చిత్రాన్ని మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాయి. జనవరి 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇంతలోనే ఐటీ దాడులు జరిగాయి. ఇక శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్ హౌస్ తోనూ సుకుమార్ రైటింగ్స్ కొన్ని సినిమాలు నిర్మిస్తోంది. అలానే దిల్ రాజుకు చెందిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ తో కలిసి 'సెల్ఫిష్' సినిమా చేస్తున్నారు.

Tags:    

Similar News