ధనుష్ డైరెక్షన్.. మేకర్స్ కాన్ఫిడెన్స్ ఏ రేంజ్ లో ఉందంటే..

ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జాబిలమ్మ నీకు అంతా కోపమా' సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Update: 2025-02-15 10:53 GMT

ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జాబిలమ్మ నీకు అంతా కోపమా' సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ధనుష్ గతంలో పా పాండి, రాయన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించగా, ఈసారి మరొక హార్ట్‌ఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యాడు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నటీనటులు, టీమ్‌ సభ్యులు సినిమాపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

తెలుగులో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ విడుదల చేస్తున్న సందర్భంగా, మూవీ టీమ్ మీడియా ముందుకు వచ్చింది. ఇందులో ప్రధాన పాత్రధారులైన జాన్వీ నారంగ్, అనికా సురేంద్రన్, రబియా, వెంకటేష్ మీనన్, రమ్య రంగనాథన్, పవిష్ తదితరులు తమ అనుభవాలను వెల్లడించారు. ముఖ్యంగా, ధనుష్‌ తన హోమ్ బ్యానర్ వండర్‌బార్ ఫిల్మ్స్‌ ద్వారా నిర్మించిన ఈ సినిమా, ప్రేక్షకులకు మరో క్లాసిక్ లవ్ స్టోరీని అందించనుందని టీమ్ నమ్మకంగా చెబుతోంది.

నటి జాన్వీ నారంగ్ మాట్లాడుతూ, ఈ సినిమా ద్వారా తనకు కొత్త అనుభవం లభించిందని, ధనుష్ గారికి తెలుగులో సినిమాను రిలీజ్ చేసే అవకాశం కల్పించినందుకు థాంక్స్ చెబుతూ, ఈ చిత్రం ఓ విభిన్నమైన ప్రేమకథగా అందరికీ నచ్చుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అదే విధంగా, అనికా సురేంద్రన్, ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని, తెలుగు ప్రేక్షకులు ఈ కథను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది.

రబియా ఈ చిత్రంతోనే తన సినీ ప్రస్థానం ప్రారంభించుకుంటోందని చెబుతూ, షూటింగ్ అనుభవాలను పంచుకుంది. కొత్తగా వస్తున్న నటి అయినా, సినిమా కథ తనను ఎంతో కనెక్ట్ చేసిందని, ప్రేక్షకులు కూడా అదే రీతిలో కనెక్ట్ అవుతారని తెలిపింది. మరోవైపు, వెంకటేష్ మీనన్, రమ్య రంగనాథన్ కూడా తమ అనుభవాలను వెల్లడిస్తూ, సినిమా కోసం ఎంతో కష్టపడ్డామని, ఇది ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని చెబుతూ, ఫిబ్రవరి 21న థియేటర్లలో సినిమాను తప్పక చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సినిమాతో పవిష్‌ కూడా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాడు. తనను వెండితెరకు పరిచయం చేసిన వెంకీ అట్లూరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సినిమాలో అందరూ ఎంతో ఇష్టపడి పని చేశారని చెప్పాడు. తెలుగు ప్రేక్షకుల మద్దతుతో సినిమా పెద్ద విజయాన్ని అందుకుంటుందని నమ్మకంగా ఉన్నట్టు తెలిపాడు. ప్రస్తుతం లవ్ స్టోరీలకు మంచి ఆదరణ ఉండటంతో, జాబిలమ్మ నీకు అంతా కోపమా మరో క్రేజీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా నిలిచే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక ధనుష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ సరికొత్త అనుభూతిని మిగిల్చేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News