'జైలర్' కాదు ఆయన 'రూలర్' !
తాజాగా అమెజాన్ విడుదల చేసిన లెక్కలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలగక మానదు.
సూపర్ స్టార్ రజినీకాంత్ పుష్కర కాలం తర్వాత కమర్షియల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ స్థాయికి తగ్గ సక్సెస్ ఇన్నాళ్లుగా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన వారికి జైలర్ సినిమా ఆ లోటును భర్తీ చేయడం జరిగింది.
జైలర్ సినిమా రికార్డ్ స్థాయి వసూళ్లు నమోదు చేసింది. తమిళ్ సినీ ఇండస్ట్రీ లో టాప్ చిత్రాల జాబితాలో చేరడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో కూడా జైలర్ సినిమా దుమ్ము రేపుతూ వసూళ్లు సాధించింది. ఇక విదేశాల్లో ఈ సినిమా సాధించిన వసూళ్ల ముందు ఇతర తమిళ్ చిత్రాలు వెలవెలబోయాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
థియేటర్లలో సంచలనం సృష్టించిన జైలర్ సినిమాను తాజాగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయడం జరిగింది. థియేటర్ రిలీజ్ అయిన మూడు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ చేయడంను కొందరు అభిమానులు తప్పుబట్టినా కూడా చూడాలి అనుకునే వారు పెద్ద ఎత్తున చూస్తున్నారు.
కేవలం తమిళ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు జైలర్ ను ఆయా భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. తాజాగా అమెజాన్ విడుదల చేసిన లెక్కలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇండియాలో టాప్ 10 స్థానంలో ట్రెండ్ అవుతున్న జైలర్ సినిమా యూఏఈ, యూకే, సింగపూర్, బంగ్లాదేశ్, మలేషియా, శ్రీలంక, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో కూడా టాప్ 10 లో ట్రెండ్ అవ్వడం విశేషం.
రజినీకాంత్ ను ఈ సినిమాలో ఆయన వయసుకు తగ్గ పాత్రలో చూపించడం జరిగింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ ఈ సినిమా తో రజినీకాంత్ అభిమానులకు విందు భోజనం అందించాడు. కనుక ఈ సినిమా కమర్షియల్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. థియేటర్ లలో మొదటి సారి రికార్డులు సాధించగా, ఓటీటీ లో కూడా రికార్డుల పరంపర కొనసాగుతోంది.