జానీ మాస్టర్‌కి స్టార్ హీరో నుంచి ఛాన్స్!
జానీ మాస్టర్ సోషల్ మీడియాలో గతంలో చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. బెయిల్ పై వచ్చిన తర్వాత మెల్లమెల్లగా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నాడు.
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటూ పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో మొన్నటి వరకు జైల్లో ఉండి వచ్చిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. సాధారణంగా జానీ మాస్టర్ ఇతర కేసులతో జైలుకు వెళ్లి వచ్చి ఉంటే ఇప్పటికే టాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చి ఉండేవి. కానీ పోక్సో కేసు కింద అరెస్ట్ కావడంతో ఆయనతో వర్క్ అంటే తెలుగు హీరోలు ఒకింత భయ పడుతున్నారు. వివాదం అవసరమా అంటూ కొందరు ఆయనకు దూరంగా ఉంటున్నారు. ఆయనతో మంచి సంబంధాలు ఉన్నా దూరంగానే పెడితే తమకు బెటర్ అన్నట్లుగా చాలా మంది ఉన్నారు.
జానీ మాస్టర్ సోషల్ మీడియాలో గతంలో చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. బెయిల్ పై వచ్చిన తర్వాత మెల్లమెల్లగా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నాడు. ఇటీవల రాకింగ్ రాకేష్ నటించిన కేసీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మొదటి సారి కనిపించాడు. ఎట్టకేలకు మళ్లీ డాన్స్‌తో జానీ మాస్టర్ బిజీ కాబోతున్నాడట. బాలీవుడ్ కు చెందిన యంగ్ స్టార్ హీరో సినిమాలో ప్రత్యేక పాటకి డాన్స్ కంపోజ్ చేసే బాధ్యత జానీ మాస్టర్‌కి దక్కింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ విషయమై అధికారికంగా క్లారిటీ రాలేదు.
తనకు వచ్చిన ఆఫర్‌ను ఎప్పుడూ సద్వినియోగం చేసుకుంటూ ఉండే జానీ మాస్టర్ ఈసారి కూడా అంతకు మించి అన్నట్లుగా తన డాన్స్‌తో మెప్పించే అవకాశాలు ఉన్నాయి. కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న జానీ మాస్టర్ కేసు వివాదం వల్ల అవార్డు చేజారిన విషయం తెల్సిందే. అది ఆయనకు చాలా పెద్ద డ్యామేజ్. కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ కష్టపడి జాతీయ అవార్డు స్థాయిలో మళ్లీ తన పనితనం చూపిస్తాను అంటూ సన్నిహితుల వద్ద జానీ మాస్టర్ అన్నారట. అన్నట్లుగానే త్వరలో హిందీ సినిమా కోసం కొరియోగ్రఫీ చేయబోతున్నాడు.
టాలీవుడ్‌లో అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి ఇంకా ఎంతో మంది స్టార్స్‌కి కోలీవుడ్‌లో విజయ్‌తో పాటు ఇంకా ఎంతో మంది ప్రముఖ హీరోలకు కొరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్ హీరోగానూ ఒక సినిమా రూపొందుతోంది. ఆ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక జానీ మాస్టర్ కేసు విషయానికి వస్తే విచారణ జరుగుతోంది. కోర్టు పరిధిలో ఉంది కనుక జానీ మాస్టర్ రెగ్యులర్‌గా కోర్టు వాయిదాలకు హాజరు కావాల్సి ఉంటుందట.