హిట్టు కథతో రీమేక్.. తరుణ్ భాస్కర్ ఏం చేస్తారో?

బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం మలయాళం సినిమాల హవా నడుస్తోంది. చిన్న సినిమాలుగా విడుదలై బ్లాక్ బస్టర్లుగా మారుతున్నాయి

Update: 2024-04-18 07:18 GMT

బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం మలయాళం సినిమాల హవా నడుస్తోంది. చిన్న సినిమాలుగా విడుదలై బ్లాక్ బస్టర్లుగా మారుతున్నాయి. మిగతా భాషల్లో కూడా రిలీజ్ అయ్యి మోస్తరు వసూళ్లు రాబడుతున్నాయి. దీంతో అందరూ ఆ సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మరో మలయాళ మూవీ తెలుగులో రీమేక్ కానుందన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కోవిడ్ టైమ్ లో ఓటీటీలకు సినీ ప్రియులు బాగా అలవాటు పడిన విషయం తెలిసిందే. అప్పుడు మలయాళ సినిమాలకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. అలా 2022 లో రిలీజైన జయ జయ జయహే మూవీ ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మ‌ల‌యాళం రీమేక్‌ లో డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ హీరోగా న‌టించ‌నున్న‌ట్లు సినీ వర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

నాగచైతన్య దూత వెబ్ సిరీస్ లో తన యాక్టింగ్ తో అదరగొట్టిన ఆయన.. ఇప్పుడు జయ జయ జయహే రీమేక్‌ లో ప్రధాన పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నారట. అయితే మాతృకలో బాసిల్ జోసెఫ్‌, ద‌ర్శ‌న‌ రాజేంద్ర‌న్ హీరో హీరోయిన్లుగా న‌టించారు. బాసిల్ జోసెఫ్ కూడా దర్శకుడు కావడం గమనార్హం. గోధా సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఇప్పటికే అనేక సినిమాల్లో నటించారు.

మాలీవుడ్ లో హాస్య నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న బాసిల్.. జయ జయ జయహే మూవీలోని క్యారెక్టర్ కు సరిగ్గా సరిపోయారు. అయితే తరుణ్ భాస్కర్.. కెరీర్ లో హీరోగా ఇంకా ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకోలేదు. అనేక సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ రోల్స్ చేసినా.. ఇప్పటి వరకు మీకు మాత్రమే చెప్తా మూవీలో హీరోగా యాక్ట్ చేశారు.

ఇక జయ జయ జయహే సినిమా అంతా హీరో పాత్ర చుట్టూనే నడుస్తుంది. దీంతో ఆ రోల్ కోసం డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బాగా కష్ట పడాల్సి ఉంది. తన టాలెంట్ ను మొత్తం బయట పెట్టాలి. ప్రియదర్శి, అల్లరి నరేష్, రాహుల్ రామకృష్ణ వంటి పలువురు నటులు.. ఆ రోల్ కు సరిగ్గా సరిపోతారని సినీ పండితులు చెబుతున్నారు. మరి తరుణ్ ఎలా నటిస్తారో చూడాలని అంటున్నారు.

ఇక ఒరిజిన‌ల్ మూవీలో హీరోయిన్‌ గా న‌టించి తన యాక్టింగ్ తో అదరగొట్టిన ద‌ర్శ‌న రాజేంద్ర‌న్ ఈ రీమేక్ తో టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు వార్త‌లు వస్తున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News