ఇకపై అసలు పేరుతోనే తనను పిలవాలని రిక్వెస్ట్ చేసిన స్టార్ హీరో..!

రవి మోహన్‌ అంటే సినీ అభిమానులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 'జయం రవి' అంటే మాత్రం అందరికీ సుపరిచితమే.

Update: 2025-01-13 23:30 GMT

రవి మోహన్‌ అంటే సినీ అభిమానులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 'జయం రవి' అంటే మాత్రం అందరికీ సుపరిచితమే. తన డెబ్యూ మూవీ టైటిల్ నే తన పేరుగా మార్చుకున్న ఈ తమిళ హీరో.. గత రెండు దశాబ్దాలుగా అదే పేరుతో పిలవబడుతున్నాడు. అయితే ఇకపై తన జయం రవి అని పిలవొద్దని ఫ్యాన్స్ ను, మీడియాని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఈరోజు నుంచి తన అసలు పేరైన రవి మోహన్‌ లేదా రవి అని పిలవాలని కోరారు. పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా తన ఒరిజినల్ నేమ్ నే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఓ నోట్‌ ను విడుదల చేశారు.

"ఎన్నో ఆశలు, అంతులేని అవకాశాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో, నా ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే ముందు నేను తీసుకున్న ఓ కీలక నిర్ణయాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను. సినిమా అనేది ఎప్పుడూ నా గ్రేటెస్ట్ ప్యాషన్. అది నా కెరీర్‌కు పునాది. నేను ఈరోజు ఇలా ఉండటానికి కారణం సినిమానే. నా సినీ ప్రయాణంలో మీరందరూ చూపించిన ప్రేమ, మద్దతుకు ఎప్పటికీ నేను కృతజ్ఞత చూపిస్తాను. నాకు జీవితాన్ని, ప్రేమను, లక్ష్యాన్ని అందించిన ఇండస్ట్రీకి నా మద్దతును అందించడానికి నేను ఎదురుచూస్తున్నాను"

"ఈ రోజు నుండి నన్ను రవి లేదా రవి మోహన్ అని పిలవండి. ఇకపై నా వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాల్లోనూ ఇదే పేరు ప్రతిధ్వనిస్తుంది. నేను ఈ కొత్త అధ్యాయంలోకి వెళుతున్నప్పుడు, ప్రతి ఒక్కరూ నన్ను ఈ పేరుతోనే సంబోధించవలసిందిగా కోరుతున్నాను. ఇకపై జయం రవి అని పిలవొద్దని అభ్యర్తిస్తున్నాను. ఇది నా వ్యక్తిగత ప్రకటన.. వినయపూర్వకమైన అభ్యర్థన" అని రవి మోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘రవి మోహన్‌ స్టూడియోస్‌’ అనే నిర్మాణ సంస్థను, ‘రవి మోహన్‌ ఫ్యాన్స్‌ ఫౌండేషన్‌’ అనే ఆర్గనైజేషన్‌ను ప్రారంభించినట్లుగా తెలిపారు.

"సినిమా పట్ల నా అచంచలమైన అభిరుచిని కొనసాగించడానికి, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ప్రేరేపించే, ఆకర్షించే, ప్రతిధ్వనింపజేసే అద్భుతమైన కథలను కనుగొని, వాటిని ప్రేక్షకులకు అందించడానికి 'రవి మోహన్ స్టూడియోస్' అనే నిర్మాణ సంస్థను ప్రారంభించడానికి నేను సంతోషిస్తున్నాను. దీని ద్వారా టాలెంట్ ను ప్రోత్సహించడంతో పాటుగా అర్థవంతమైన కథలను తీసుకురావాలనే నిబద్ధతతో ఉన్నాను. నా అభిమానులే నా బలం. వారు నన్ను మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి ప్రేరేపిస్తారు. నాకు మద్దతిచ్చిన ప్రజలకు, సంఘాలకు ఎంతో కొంత తిరిగి ఇవ్వడానికి, నేను నా అభిమాన సంఘాలన్నింటినీ 'రవి మోహన్ ఫ్యాన్స్ ఫౌండేషన్' పేరుతో నిర్మాణాత్మక సంస్థగా మారుస్తున్నాను. అవసరంలో ఉన్న వారందరికీ సహాయం చేయడానికి, మన సమాజంలో సానుకూల ప్రభావాన్ని చూపడానికి ఈ ఫౌండేషన్ పని చేస్తుంది" అని రవి తన నోట్ లో రాసుకొచ్చారు.

కాగా, ప్రముఖ ఎడిటర్‌ మోహన్‌ తనయుడే హీరో రవి అని సంగతి తెలిసిందే. 'ధృవ', 'గాడ్ ఫాదర్' చిత్రాల దర్శకుడు మోహన్‌ రాజా ఆయనకు తోడబుట్టిన అన్న. రవి ‘బావ బావమరిది’, ‘పల్నాటి పౌరుషం’ వంటి తెలుగు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. 2003లో ‘జయం’ తమిళ రీమేక్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీ సక్సెస్ అవ్వడంతో అప్పటి నుంచే 'జయం రవి' అని పిలుస్తున్నారు. అతను కూడా దాన్నే స్క్రీన్ నేమ్ గా కొనసాగిస్తూ వచ్చాడు. కానీ ఇప్పటి నుంచి అలా సంబోధించవద్దని కోరుతున్నాడు. ఈ క్రమంలోనే తన సోషల్ మీడియా అకౌంట్స్ లో నేమ్ కూడా చేంజ్ చేశాడు.

రవి మోహన్ ప్రస్తుతం 'కాదలిక్క నేరమిల్లై', JR 34, 'తని వరువన్ 2' వంటి తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. అలానే శివ కార్తికేయన్ 25వ సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే, గతేడాది సెప్టెంబర్ లో రవి తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Tags:    

Similar News