'జానీ మాస్టర్ పై మాదే గెలుపు'- ఝాన్సీ పోస్ట్ వైరల్

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Update: 2025-01-29 05:42 GMT

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆయన వద్ద పనిచేసిన లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయగా, జానీ అరెస్ట్ అయ్యి జైలులో కొద్ది రోజులు గడిపారు. ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చి వర్క్ తో బిజీ అవుదామని చూస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు.

అదే సమయంలో ఫిల్మ్ ఇండస్ట్రీ లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ మెంబర్, నటి ఝాన్సీ పెట్టిన పోస్ట్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. జానీ మాస్టర్ పై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ కేసు గెలిచిందని ఆమె తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలను జానీ మాస్టర్.. జిల్లా కోర్టులో సవాలు చేశారని ఝాన్సీ ఈ సందర్భంగా చెప్పారు.

జానీ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ ను కోర్టు కొట్టివేసిందని.. అది ఒక ముఖ్యమైన తీర్పుగా వర్ణించారు ఝాన్సీ. పని ప్రదేశాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఉందని ఆ తీర్పు మరోసారి రుజువు చేసిందని, POSH మార్గదర్శకాలు అమలు చేయాలని చాటి చెప్పిన విధంగా తీర్పు ఉందని కొనియాడారు ఝాన్సీ.

కఠినంగా వ్యవహరించి, న్యాయపరంగా పోరాడేలా చేసిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి ధన్యవాదాలు అంటూ ఝాన్సీ పోస్ట్ చేశారు. అయితే జానీ మాస్టర్ పై ఆరోపణలు చేసిన బాధితురాలు.. అప్పుడు లైంగిక వేధింపుల పరిష్కార కమిటీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఛాంబర్.. ఓ నిర్ణయం తీసుకుంది.

జానీ మాస్టర్ ను డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫిల్మ్ ఛాంబర్.. ఫెడరేషన్ ను ఆదేశించింది. అయితే తనపై ఉన్న కేసు కోర్టులో ప్రూవ్ అవ్వకుండా ఎలా తప్పిస్తారని జానీ జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ పిటిషన్ ను జిల్లా కోర్టు విచారించి కొట్టి వేసినట్లు అర్థమవుతోంది.

దీంతో జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలిందని చెప్పాలి. అయితే రీసెంట్ గా ఆయనకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు అవుతుందని వార్తలు వినిపించాయి. అందులో ఎలాంటి నిజం లేదని చెప్పారు జానీ. తనకు న్యాయస్థానంపై నమ్మకం ఉందని, తాను తప్పకుండా నిర్దోషిగా బయటపడతానని అన్నారు. మరి ఆ కేసులో చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News