జితేందర్ రెడ్డి ట్రైలర్: ఈ దేశానికి మనమేం ఇచ్చామో చెప్పండి!
ఈ పొలిటికల్ డ్రామాకు 'జితేందర్ రెడ్డి' లాంటి పవర్ ఫుల్ టైటిల్ ని ఎంపిక చేయడం ఆసక్తిని కలిగించింది.
'ఉయ్యాలా జంపాలా' ఫేమ్ దర్శకుడు విరించి వర్మ తెరకెక్కించిన తాజా ప్రాజెక్ట్ 'జితేందర్ రెడ్డి'. ముదుగంటి క్రియేషన్స్ అధినేత ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ పొలిటికల్ డ్రామాకు 'జితేందర్ రెడ్డి' లాంటి పవర్ ఫుల్ టైటిల్ ని ఎంపిక చేయడం ఆసక్తిని కలిగించింది. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ కి అద్భుత స్పందన వచ్చింది.
ఈ చిత్రం 1980లలో ఒక తెలంగాణ గ్రామంలో జరిగిన కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందింది. ఆ కాలంలోని సామాజిక-రాజకీయ వాస్తవాలను ఈ చిత్రం తెరపైకి తెస్తోంది. విఎస్ జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. కార్మికులతో మమేకమయ్యే.. ఉద్యమ స్ఫూర్తితో నడిచే కథానాయకుడిని ఇంతకుముందు పరిచయం చేయగా ఆసక్తిని పెంచింది.
తాజాగా జితేందర్ రెడ్డి ట్రైలర్ విడులైంది. ట్రైలర్ ఆద్యంతం కథానాయకుడి విప్లవ పంథా అన్యాయాన్ని సహించలేని తత్వం.. దేశభక్తి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం గురించిన డైలాగ్ ప్రత్యేకంగా చర్చకు తెర లేపుతోంది. ఇక ట్రైలర్ చివరిలో ఎవరీ యంగ్ మేన్? అంటూ సీనియర్ ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేయడంతో ఆసక్తిని కలిగించింది. ట్రైలర్ లో నక్సలిజం బ్యాక్ డ్రాప్ ఎమోషన్ ని రగిలిస్తోంది. అయితే నక్సలైట్లు దేశభక్తులు కాదు.. ప్రాణాలు నిలిపేవాళ్లు దేశభక్తులు వంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. దేశాన్ని కాపాడుకోవాలంటే ధర్మాన్ని కాపాడుకోవాలి.. ఇది ప్రతి ఒక్క భారతీయుడి కర్తవ్యం! అంటూ ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
మే 10న మీకు సమీపంలోని సినిమా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో రాకేష్ వర్రే, రియా సుమన్ తదితరులు నటించారు. గోపి సుందర్ సంగీతం అందించారు.