మూగ‌జీవాల‌ కోసం ఉపాస‌న త‌ర్వాత స్టార్ హీరో పిలుపు!

వేట‌గాళ్ల‌కు లైసెన్సులు మంజూరు చేయాల‌ని అధికారికంగా ఐస్ ల్యాండ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన కార‌ణంగా త‌న ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నాన‌ని అన్నారు.

Update: 2024-12-22 12:30 GMT

ఇటీవ‌ల ఉపాస‌న కొణిదెల త‌న ఐస్ ల్యాండ్ ప‌ర్య‌ట‌న‌ను అర్థాంత‌రంగా క్యాన్సిల్ చేసుకోవ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వ‌రుస‌గా దేశ‌విదేశాల్లో ప‌ర్య‌టిస్తున్న ఉపాస‌న ఐస్ ల్యాండ్ లో విహార‌యాత్ర‌కు వెళ్లాల్సి ఉండగా, త‌న ప్ర‌యాణాన్ని ర‌ద్దు చేసుకోవ‌డానికి కార‌ణం.. అక్క‌డి ప్ర‌భుత్వం 2000 తిమింగ‌ళాల్ని నిర్ధ‌య‌గా చంప‌డానికి ఆదేశించ‌డ‌మేన‌ని తెలిపారు. వేట‌గాళ్ల‌కు లైసెన్సులు మంజూరు చేయాల‌ని అధికారికంగా ఐస్ ల్యాండ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన కార‌ణంగా త‌న ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నాన‌ని అన్నారు.

ఉపాస‌న నిర్ణ‌యాన్ని అభిమానులు స‌మ‌ర్థించారు. త‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఒక గొప్ప కాజ్(సామాజిక కార‌ణం) కోసం విహార‌యాత్ర‌ను ర‌ద్దు చేసుకోవ‌డాన్ని గ‌ర్వంగా చెప్పుకున్నారు అభిమానులు. ఇప్పుడు అలాంటి ఒక కాజ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్ర‌హాం ముందుకు వ‌చ్చారు. అడ‌వుల్లో జీవించే తెలివైన, సున్నిత‌మైన‌ జంతువుల్లో ఏనుగులు ఉన్నాయి. వాటిని హింసించ‌డం ఆపాల‌ని జాన్ పిలుపునిచ్చాడు. జంతువుల‌ను మాన‌సికంగా హింసిస్తూ శారీర‌క ఒత్తిడికి గురి చేయ‌డం స‌రికాద‌ని సూచించాడు. ఈ కార‌ణంగా 'చిత్వాన్ ఎలిఫెంట్ ఫెస్టివల్‌'ను రద్దు చేయాలని జాన్ అబ్రహం నేపాల్ ప్రభుత్వాన్ని కోరారు. ఆమేర‌కు నేపాల్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఒక లేఖను షేర్ చేసారు. దీనికంటే నైతికంగా మంచిని ప్రోత్స‌హించే వ‌న్య‌ప్రాణి ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేయాల‌ని సూచించారు.

చిత్వాన్ ఎలిఫెంట్ ఫెస్టివల్‌లో ఏనుగులను ఆట‌ల పేరుతో ఒత్తిడికి గురి చేస్తార‌ని జాన్ అన్నారు. ఇది కొందరికి ఆనందం క‌లిగించ‌వ‌చ్చు కానీ, ఏనుగులపై ఒత్తిడి ప్రభావం గురించి ఆందోళ‌న చెందుతున్నాను అని అన్నారు. ఏనుగులు తెలివైనవి.. ఇలాంటి సున్నితమైన జంతువులతో ఆటలు మంచిది కాదు. వాటిపై శారీరక , భావోద్వేగ ఒత్తిడిని పెంచ‌కూడ‌ద‌ని అన్నారు. తరచూ కఠినమైన శిక్షణా పద్ధతుల కార‌ణంగా బాధ‌కు గుర‌వుతాయ‌ని అన్నారు. క‌ఠిన‌మైన ఆట‌ల స్థానంలో ''ఏనుగుల‌ పోలో, ఏనుగుల‌ ఫుట్‌బాల్'' వంటి ఆట‌ల‌ను నైతిక వైల్డ్‌లైఫ్ టూరిజంలో భాగం చేయాల‌ని కూడా సూచించారు. పర్యావరణ పర్యాటకంలో ప్రపంచ అగ్రగామిగా నేపాల్ ఎదగాల‌ని ఆకాంక్షించారు. జీవ‌రాశుల విష‌యంలో మాన‌వీయ‌త చాలా అవ‌స‌ర‌మ‌ని కూడా జాన్ అబ్ర‌హాం సూచించారు.

మూగ‌జీవాలు, వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ కోసం గొంతెత్తేవారిలో అక్కినేని అమ‌ల‌, త్రిష, ఉపాస‌న‌ స‌హా దేశ‌వ్యాప్తంగా ప‌లువురు సెల‌బ్రిటీలు ఉన్నారు. చాలామంది తార‌లు వెజిటేరియన్ ఆహారాన్ని ప్రోత్స‌హిస్తూ జంతు ఆహారాన్ని నిషేధించాల‌ని కోరుతున్నారు. బ్లూక్రాస్, పెటా వంటి ప్ర‌భావ‌వంత‌మైన సామాజిక సంస్థ‌ల కార‌ణంగా ప్రాణులు, జీవ‌రాశుల‌పై హింస పాళ్లు కొంతమేర‌ తగ్గించే ప్ర‌య‌త్నం హ‌ర్ష‌ణీయ‌మైన‌ది. జాన్ అబ్ర‌హాం పెటా- ఇండియా ప్ర‌చార‌క‌ర్త‌గా ఉన్నారు. జంతు జీవ‌జాలాల‌పై హింస‌ను ఆపాల‌ని అత‌డు చేస్తున్న‌ ప్ర‌చారం స‌త్ఫ‌లితాలిస్తోంది.

Tags:    

Similar News