జానీ మాస్టర్ కేసు.. ఈవెంట్ల పేరుతో దూర ప్రాంతాలకు తీసుకువెళ్లి..!

అయితే, కేసు విచారణలో తాజా పరిణామాలు జానీ మాస్టర్ కెరీర్‌పై మరింత ప్రభావం చూపుతాయా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Update: 2024-12-26 04:44 GMT

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు మరో కీలక మలుపు తిరిగింది. తన వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదు అయి, అప్పటినుంచి విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నార్సింగ్ పోలీసులు తాజా దర్యాప్తు ద్వారా కీలక విషయాలు నిర్ధారించారు.

దర్యాప్తులో భాగంగా, లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులు జరిగాయని పోలీసులు స్పష్టంగా నిర్ధారించారు. ఈవెంట్ల పేరుతో బాధితురాలిని దూర ప్రాంతాలకు తీసుకువెళ్లి, అక్కడ లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. బాధితురాలు పోలీసులకు అందించిన సమాచారంతో పాటు సేకరించిన ఆధారాలపై విచారణ కొనసాగిస్తూ ఈ విషయం బయటకు వచ్చింది.

సెప్టెంబర్ 15న బాధితురాలు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేశారు. దాంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళి, చివరకు గోవాలో పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. సెప్టెంబర్ 20న కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించారు. అనేక ప్రయత్నాల తరువాత, అక్టోబర్ 25న బెయిల్ మంజూరు కావడంతో జైలులో నుంచి విడుదలయ్యారు.

లైంగిక ఆరోపణల కారణంగా జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు ప్రదానం చేయడం తాత్కాలికంగా నిలిపివేయబడింది. జోరీ మెంబర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది జానీ మాస్టర్ కెరీర్‌పై భారీ ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. పైగా, పుష్ప 2 సినిమాలో పనిచేసే అవకాశం కూడా ఈ వివాదం కారణంగా కోల్పోయారు.

బెయిల్‌పై విడుదలైన తర్వాత, జానీ మాస్టర్ మళ్లీ సినిమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమాలో ఓ పాటకు కొరియోగ్రఫీ చేసే అవకాశం లభించిందని సమాచారం. అయితే, కేసు విచారణలో తాజా పరిణామాలు జానీ మాస్టర్ కెరీర్‌పై మరింత ప్రభావం చూపుతాయా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

నార్సింగ్ పోలీసులు, జానీ మాస్టర్‌పై ఉన్న అన్ని ఆరోపణల ఆధారంగా తాజాగా ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. ఇందులో లైంగిక వేధింపులు జరుగిన సందర్భాలు, ఆధారాలు స్పష్టంగా పొందుపరచబడ్డాయి. ఈ ఛార్జ్‌షీట్ కారణంగా, మరోసారి జానీ మాస్టర్‌ను కస్టడీలోకి తీసుకునే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ కేసు టాలీవుడ్‌లో పెద్ద సంచలనం సృష్టించింది. ఒకవైపు బాధితురాలి న్యాయం కోసం ప్రయత్నాలు జరుగుతుండగా, మరోవైపు జానీ మాస్టర్ కెరీర్‌పై ప్రభావం ఏర్పడింది. మరి ఈ కేసులో చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News