జానీ మాస్టర్.. సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్
జానీ మాస్టర్, వారి కుటుంబ సభ్యులు బాధితురాలిని బెదిరింపులకు పాల్పడవద్దని ఆదేశించారు.
టాలీవుడ్ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నమోదైన లైంగిక వేధింపుల కేసు గురించి అందరికీ తెలిసిందే. ఆయన వద్ద పనిచేసిన ఓ లేడీ కొరియోగ్రాఫర్ దాఖలు చేసిన కేసులో కొన్ని రోజుల పాటు చంచల్ గూడ జైల్లో గడిపిన జానీకి ఇటీవల తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.
జానీ మాస్టర్, వారి కుటుంబ సభ్యులు బాధితురాలిని బెదిరింపులకు పాల్పడవద్దని ఆదేశించారు. ఆమె పని చేసే వద్దకు వెళ్లి ఏమైనా ఇబ్బందులు కలిగిస్తే బెయిల్ రద్దు చేస్తామని షరతులు విధించారు. ఆ తర్వాత అక్టోబర్ 25వ తేదీన జైలు నుంచి బయటకొచ్చిన జానీ మాస్టర్.. ఇప్పుడు ఫ్యామిలీతో గడపుతున్నారు. వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు.
అదే సమయంలో జానీ మాస్టర్ కు తాజాగా మరో భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అక్టోబరు 24న హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయడానికి నిరాకరించింది. ఫిర్యాదుదారు దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రతో కూడిన ధర్మాసనం జానీ మాస్టర్ బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ ను డిస్మిస్ చేసింది. తాము తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని క్లారిటీ ఇచ్చింది. అలా జానీ మాస్టర్ కు బిగ్ రిలీఫ్ దక్కినట్లు అయింది. అసలు కేసు ఏంటంటే?
జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని ఆయన వద్ద గతంలో అసిస్టెంట్ గా పనిచేసిన ఓ యువతి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ గా ఉన్నప్పుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో ఆరోపించారు. రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ ఐఆర్ నమోదు చేసి.. నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేశారు.
దీంతో నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ పై పోక్సో సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపి గాలింపు చర్యలు చేపట్టారు. గోవాలో ఆయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత దాదాపు నెల రోజులకు పైగా జానీ మాస్టర్ చంచల్ గూడ జైలులో ఉన్నారు. కొద్ది రోజుల హైకోర్టు ఇచ్చిన బెయిల్ తో బయటకొచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఊరట అందుకున్నారు.