కల్కి 2898 AD .. జపాన్ సరే చైనాకు వెళ్లదా?
ఇటీవలి కాలంలో భారతీయ సినిమాలు చైనా మార్కెట్లలోను విడుదలవుతున్నాయి. కొన్ని బాలీవుడ్ చిత్రాలు చైనా నుంచి భారీ వసూళ్లను సాధించాయి
ఇటీవలి కాలంలో భారతీయ సినిమాలు చైనా మార్కెట్లలోను విడుదలవుతున్నాయి. కొన్ని బాలీవుడ్ చిత్రాలు చైనా నుంచి భారీ వసూళ్లను సాధించాయి. విజయ్ సేతుపతి నటించిన `మహారాజా` చిత్రం కూడా చైనా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిందని కథనాలొచ్చాయి. అలాగే `దృశ్యం 2` చైనీ భాషలోకి రీమేకై విజయం సాధించింది. అమీర్ ఖాన్ దంగల్ మొదలు సీక్రెట్ సూపర్ స్టార్ వరకూ భారీ విజయాలను నమోదు చేసాడు. దీంతో చైనా మార్కెట్ చాలా ఆశలు పెంచింది.
అయితే చైనా మార్కెట్ ని అందుకోవడంలో టాలీవుడ్ ఇంకా చాలా వెనకబడి ఉంది. బాహుబలి చైనీ భాషలోకి అనువాదమై విడుదలైనా ఆశించిన విజయం సాధించలేదు. ఆ తరవాత పలు తెలుగు చిత్రాలను చైనాలో రిలీజ్ చేయాలని ప్రయత్నించినా అవేవీ సరిగా విజయం సాధించలేదు. కారణం ఏదైనా చైనా మార్కెట్ ఒరవడిని పసిగట్టడంలో ఇంకా మనం చాలా వెనకబడి ఉన్నామని అంగీకరించాలి.
అయితే ఇలాంటి సమయంలో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి చిత్రాన్ని చైనాలో రిలీజ్ చేస్తారా లేదా? అన్న సందిగ్ధత అభిమానుల్లో నెలకొంది. చైనా రిలీజ్ గురించి అశ్వనిదత్, నాగ్ అశ్విన్ టీమ్ నుంచి స్పందన రాలేదు. ప్రస్తుతానికి టీమ్ జపాన్ మార్కెట్ పై మాత్రమే దృష్టి సారించింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 AD ప్రస్తుతం జపాన్ అంతటా థియేటర్లలోకి విడుదలైంది. జపాన్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీటికెట్ సేల్ సంతృప్తికరంగా ఉందని సమాచారం. ఇప్పటివరకూ జపనీ బాక్సాఫీస్ వద్ద ఆర్.ఆర్.ఆర్ నంబవర్ వన్ స్థానంలో ఉంది. కల్కి దీనిని సులభంగా అధిగమిస్తుందని పంపిణీదారులు భావిస్తున్నారు. అయితే ప్రభాస్ గాయం కారణంగా జపాన్ లో ప్రచారానికి వెళ్లలేకపోయాడని తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ `కల్కి 2898 AD` చిత్రాన్ని నిర్మించింది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్‌హాసన్, రాజేంద్రప్రసాద్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. గత ఏడాది జూన్ లో పాన్ ఇండియాలో విడుదలైన ఈ చిత్రం దాదాపు 1200 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.
RRR రికార్డును కొట్టాలంటే..?
జపాన్ లో రాజమౌళి RRR విజయవంతంగా 200 రోజుల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసింది. 22 కోట్లు (410 మిలియన్ యెన్) వసూలు చేసింది. జపాన్‌లోని 40 పైగా నగరాలు, ఇతర ప్రదేశాల్లో 210 స్క్రీన్‌లు , 32 ఐమాక్స్ స్క్రీన్‌లలో విడుదలైంది. ఆర్.ఆర్.ఆర్ జపనీ బాక్సాఫీస్ వద్ద నం.1 స్థానంలో నిలిచింది. జపాన్‌లో ప్రభాస్ స్టార్ డమ్ దృష్ట్యా ఇప్పుడు ఆ రికార్డులను కల్కి 2898 AD బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.