కల్కి2.. కమల్‌తోనే మొదలా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898ఏడీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898ఏడీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. కలెక్షన్స్ పరంగా కూడా కల్కి కొత్త రికార్డులను నెలకొల్పింది. అయితే కల్కి క్లైమాక్స్ లో దీనికి కొనసాగింపు ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో కల్కి2 ఎప్పుడెప్పుడొస్తుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటూ సగటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రస్తుతం దానికి సంబంధించిన స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ప్రభాస్ ఎప్పుడైతే సినిమాకు రెడీ అవుతాడో వెంటనే సినిమాను మొదలుపెట్టి ప్లానింగ్ ప్రకారం పూర్తి చేయాలని చూస్తున్నాడు. అంతా ప్రణాళిక ప్రకారం ముందే అనుకుని 2026 ఎండింగ్ కు సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం కల్కి సెకండ్ పార్ట్ షూటింగ్ జూన్ మొదటి వారం నుంచి మొదలవనుందని, మొదటి షెడ్యూల్ లో కమల్ హాసన్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. కల్కిలో యాస్కిన్ సుప్రీమ్ గా తెరపై కనిపించింది కాసేపే అయినా తన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశాడు కమల్.
కల్కి కంటే కల్కి2లోనే తన పాత్ర ప్రధానంగా ఉంటుందని కమల్ ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు. ఈ సినిమాకు కర్ణ 3102 బీసీ అనే టైటిల్‌ను పెట్టాలని చూస్తున్నారట. కల్కి సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో పురాణాల గురించి కూడా ఎక్కువగా చూపించనున్నట్టు తెలుస్తోంది. కల్కి సినిమాను కర్ణుడి పాత్రతో ముగించారు కాబట్టి దానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా కథంతా కర్ణుడి పాత్ర చుట్టూనే తిరుగుతుందనుకోవచ్చు.
ఇవన్నీ చూస్తుంటే కల్కి2కు అన్నీ సెట్ అయితే ఎక్కువ టైమ్ లేకుండానే సినిమా పూర్తవుతుందని చెప్పుకోవచ్చు. ప్రభాస్ ఫ్రీ అయిపోయి కల్కి2కు డేట్స్ ఇవ్వడమే బాకీ అన్నట్టుంది పరిస్థితి. కాబట్టి నాగ్ అశ్విన్ చెప్పిన టైమ్ కు సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు.
కల్కి సీక్వెల్ లో కూడా బాలీవుడ్ నటి దీపికా పడుకొణె కనిపించనుంది. కాకపోతే ఈసారి దీపికా అమ్మ పాత్రలో కనిపిస్తుంది. అమితాబ్ చేసిన అశ్వథ్థామ పాత్రను ముగిస్తారా లేదా కొనసాగిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా కల్కి2 మొదలవక ముందే అంచనాలను మాత్రం బాగా పెంచేస్తుంది.