'సాగ‌ర సంగమం' టైమ్‌లెస్ క్లాసిక్ ఎందుకు?

క‌మల్ హాసన్ భారతీయ చలనచిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత ప్రభావవంతమైన స్టార్ల‌లో ఒక‌రిగా చ‌రిత్ర‌కెక్కారు.

Update: 2024-09-21 07:30 GMT

క‌మల్ హాసన్ భారతీయ చలనచిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత ప్రభావవంతమైన స్టార్ల‌లో ఒక‌రిగా చ‌రిత్ర‌కెక్కారు. త‌న‌దైన విల‌క్ష‌ణ న‌ట‌న‌, హావ‌భావాల‌తో, సాంకేతిక‌ అన్వేష‌కుడిగా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో అత్యంత‌ ప్రభావం చూపిన అసాధార‌ణ ప్ర‌తిభావంతుడు. కెరీర్ మొత్తంలో ఎన్నో వైవిధ్య‌మైన సినిమాల్లో న‌టించిన మేటి న‌టుడు. నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా, డ్యాన్స‌ర్‌గా అత‌డు త‌న‌ను తాను నిరూపించాడు. క‌మల్ హాస‌న్ న‌టించిన సినిమాల‌లో సాగర సంగమం ప్ర‌త్యేకత గురించి ఇప్పుడే చెప్పాల్సిన ప‌ని లేదు. 1983 నాటి క్లాసిక్ మూవీలో క‌మ‌ల్ హాస‌న్, జ‌య‌ప్ర‌ద‌ల న‌ట‌న న‌భూతోన‌భ‌విష్య‌తి. గొప్ప అభిరుచి.. జీవితంలో ఎమోష‌న్ ని తెర‌పైకి తెచ్చిన ఈ సినిమా కన్నీళ్లు తెప్పించే క్లైమాక్స్ తో ర‌క్తి క‌ట్టించింది. ఈ సినిమా టైమ్ లెస్ మాస్ట‌ర్ పీస్ అంటే త‌ప్పు కాదు. ఒక క్లాసిక్ వీక్ష‌ణ అనుభూతి కొన్ని యుగాలు వెంటాడుతుంది అంటే అతిశ‌యోక్తి కాదు. అంత గొప్ప క‌థ‌, క‌థ‌నం, న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న, సంగీతం ఈ సినిమాకి కుదిరాయి.

అయితే మేటి క్లాసిక్ గా నిలిచిన ఈ సినిమాకి మ‌న తెలుగు వాడైన కె విశ్వనాథ్ దర్శకత్వం వహించార‌ని చెప్పుకోవ‌డం తెలుగు వారికి గ‌ర్వ కార‌ణం. క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ రచన- ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కి సంచ‌ల‌నాలు సృష్టించింది. భరతనాట్యం, కూచిపూడి, కథక్‌లలో ప్రావీణ్యం సంపాదించిన ప్రతిభావంతుడైన నర్తకుడు బాలకృష్ణ అనే యువకుడి కథ ఇది. డ్యాన్స్‌లో అపురూపమైన ప్రతిభ ఉన్నా, అందులో ప్రొఫెషనల్‌గా మారడం అతనికి ఇష్టం ఉండ‌దు. బాలకృష్ణ ప్రతిభను గమనించిన సంపన్న శాస్త్రీయ నృత్యకారిణి మాధవి(జ‌య‌ప్ర‌ద‌) అనే మహిళను కలుస్తాడు. అప్పుడు ఆమె అతనికి హై-ప్రొఫైల్ క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్స్‌లో పాల్గొనేందుకు సహాయం చేస్తుంది. ఇద్దరూ కలిసి పని చేయడంతో బాలకృష్ణ ఆమెతో ప్రేమలో పడతాడు. కాబట్టి అతడు తన ప్రేమను ఆమెతో ఒప్పుకున్నప్పుడు, మాధవి తనకు వివాహమైందని ఒక కుమార్తె ఉందని, కానీ తన భర్త నుండి విడిపోయాన‌ని వెల్లడిస్తుంది. ఆ తర్వాత బాల‌కృష్ణ నిర్ణ‌యం ఏమిట‌న్నది తెర‌పైనే చూడాలి.

కొన్నేళ్లు గడిచేసరికి బాలకృష్ణ డ్రగ్స్ అడిక్ట్ అయ్యి మద్యానికి బానిస అవుతాడు. విమర్శకుడిగా అతడు శైలజ అనే నర్తకిని విమర్శించాడు. అయితే ఆమె మాధవి కుమార్తె. కాబట్టి ఇప్పుడు వితంతువు అయిన మాధవి అతని కథనాన్ని చదివినప్పుడు.. బాలకృష్ణను కలుసుకుని, శైల‌జ‌ నృత్యం నేర్పించమని పట్టుబడుతుంది. ఇది మనల్ని సినిమా క్లైమాక్స్‌కి తీసుకెళ్తుంది. శైల‌జ‌కు డ్యాన్స్ టీచర్‌గా మారిన తర్వాత చావు బ‌తుకుల మ‌ధ్య ఉన్న‌ బాలకృష్ణ తన శిష్యురాలి ఉన్న‌తిని చూసి మ‌ర‌ణించ‌డం అనే కాన్సెప్టు ఎమోష‌న్ కి గురి చేస్తుంది. తన శిష్యురాలి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం చూస్తూనే ప్రేక్షకుల మధ్య అతడు అక్కడే చనిపోతాడు.

`సాగర సంగమం` చిత్రానికి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించగా, ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు. ఇందులో కమల్ హాసన్, జయప్రద నాయ‌కానాయిక‌లుగా న‌టించారు. శరత్ బాబు, ఎస్పీ శైలజ, సాక్షి రంగారావు తదితరుల పాత్ర‌లు ఆక‌ట్టుకుంటాయి. దీనికి వాహిని బ్యానర్ స‌మ‌ర్పించింది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం, పిఎస్ నివాస్ సినిమాటోగ్ర‌ఫీ, జి.జి కృష్ణారావు ఎడిటింగ్ నైపుణ్యం ప్ర‌ధాన బలాలుగా నిలిచాయి. ఇళ‌య‌రాజా ఈ సినిమాలో ప్ర‌తి పాట‌ను క్లాసిక్ గా నిల‌బెట్టారు. ఈ సినిమాని టైమ్ లెస్ క్లాసిక్ గా నిల‌ప‌డంలో నాటి ప్ర‌తిభావంతుల అభిరుచి, హార్డ్ వ‌ర్క్, క‌మిట్ మెంట్ ప్ర‌ధాన కార‌ణాలుగా గుర్తించాలి.

Tags:    

Similar News