'కంగువా' టైమ్ ట్రావెల్... నిజమేనా?
కరోనా వల్ల ఆలస్యం అయిన సినిమా మేకింగ్ సైతం చాలా స్లోగా సాగడం వల్ల విడుదల చాలా చాలా ఆలస్యం అయింది.
తమిళ్ స్టార్ హీరో సూర్య, శివ కాంబోలో రూపొందిన కంగువా సినిమా మొదట అనుకున్న ప్రకారం దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల కంగువా సినిమాను నవంబర్ 14కు వాయిదా వేయడం జరిగింది. సినిమా షూటింగ్ ప్రారంభించింది మొదలుకుని అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు నాలుగు అయిదు సంవత్సరాలుగా సినిమా వార్తల్లో నానుతూ వస్తుంది. కరోనా వల్ల ఆలస్యం అయిన సినిమా మేకింగ్ సైతం చాలా స్లోగా సాగడం వల్ల విడుదల చాలా చాలా ఆలస్యం అయింది. ఏడాది కాలంగా రిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కంగువా సినిమా గురించి మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా కథ గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కథనాలు అల్లేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కథ ఒక టైమ్ ట్రావెల్ కథ అంటున్నారు, రెండు టైమ్ జోన్ ల మధ్య సాగే ఈ కథ లో సూర్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. వంద సంవత్సరాల క్రితం కథ ను 2024 కాలానికి లింక్ చేస్తూ సాగే కథ తో కంగువా రూపొందినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత టెక్నాలజీని 100 సంవత్సరాల క్రితం వినియోగిస్తే ఎలా ఉంటుంది అనేది సినిమా కథ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విభిన్న, యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలను ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి మెప్పించిన దర్శకుడు శివ ఈ సినిమాను అంతకు మించి అన్నట్లుగా రూపొందించాడు. తమిళ్ లో రూపొందిన ఈ సినిమా తెలుగు తో పాటు మొత్తం 34 భాషల్లో విడుదల చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒక ఇండియన్ సినిమా ఇన్ని భాషల్లో విడుదల అవ్వడం చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. పాతిక దేశాలకు పైగా ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో కంగువా వసూళ్లు ఎలా ఉంటాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తమిళ్ మూవీ ఇప్పటి వరకు వెయ్యి కోట్ల మార్క్ ను టచ్ చేయలేదు. ఆ లోటును కంగువా భర్తీ చేస్తుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే కంగువా ను చాలా మంది బాహుబలి మూవీ స్థాయి మూవీ అని, తమిళ్ బాహుబలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయిలో కంగువా వసూళ్లు సాధించనుంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూర్య కు ఇది బెంచ్ మార్క్ మూవీగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. భారీ ఎత్తున సినిమా విడుదల కార్యక్రమాలు జరుగుతున్నాయి. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు ఈ సినిమాను నిర్మించారు. దిశా పటానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సూర్య చాలా స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నారని మేకర్స్ చెబుతున్నారు.