తెలుగు చిత్రాల‌పై క‌న్న‌డిగుల ద్వేషం!

తాజాగా త‌మిళ‌నాడు ని మించి కర్ణాటక శైలి క‌నిపిస్తుంది. తెలుగు సినిమా అంటే క‌న్న‌డిగులు ద్వేషం తో ర‌గిలిపోతున్నారు.

Update: 2025-01-06 07:38 GMT

సినిమాకు భాష‌తో సంబంధం లేదు. హ‌ద్దులు లేవు...స‌రిహ‌ద్దులు లేవు. మ‌న‌మంతా భార‌తీయులం. అన్ని సినిమా లు ఒక్క‌టేన‌ని టాలీవుడ్ నిత్యం సోద‌ర‌భావ‌న్నే ప్ర‌ద‌ర్శిస్తుంది. అన్ని భాషా చిత్రాల‌కు స‌మాన అవ‌కాశాలు క‌ల్పి స్తుంది. థియేట‌ర్లు కేటాయింపు కావ‌చ్చు...షూటింగ్ కి సంబంధించిన అనుమ‌తులు కావ‌చ్చు. ప్ర‌తీ విష‌యంలో టాలీవుడ్ ప‌ర‌భాషా చిత్రాల్ని ఎంతో గౌర‌విస్తుంది. వ‌రుస‌గా తెలుగు సినిమాలు రిలీజ్ కు ఉన్నా కొన్ని థియేటర్లైనా డ‌బ్బింగ్ చిత్రాల‌కు కేటాయిస్తుంది.

ఈ సంస్కృతి కేవ‌లం తెలుగు సినిమాకే సొంత‌మైంది. మ‌రి ప‌క్క‌నే ఉన్న కోలీవుడ్...శాండిల్ వుడ్ తెలుగు సినిమాపై ఎలాంటి ధోర‌ణితో వ్య‌వహరిస్తుంది అంటే? తెలుగు సినిమా రిలీజ్ అవుతుందంటే? త‌మిళ‌నాడులో థియేట‌ర్లు దొర‌క‌వు. పెద్ద సినిమాలేవి అక్క‌డ రిలీజ్ కి లేక‌పోయినా తెలుగు సినిమా అంటే అక్క‌సుతో థియేట‌ర్లు ఇవ్వ‌డ‌నికి కిందా మీదా ప‌డ‌తారు. త‌మిళ‌నాడులో ఎంతో కాలంగా తెలుగు సినిమా ఈ ర‌క‌మైన అవ‌మానానికి గుర‌వుతూనే ఉంది.

తాజాగా త‌మిళ‌నాడు ని మించి కర్ణాటక శైలి క‌నిపిస్తుంది. తెలుగు సినిమా అంటే క‌న్న‌డిగులు ద్వేషం తో ర‌గిలిపోతున్నారు. గోడ‌పై పోస్ట‌ర్ క‌నిపిస్తే చింపేస్తున్నారు. అది కుద‌ర‌క‌పోతే పోస్ట‌ర్ కి న‌ల్ల‌రంగు పూస్తున్నారు. ఆ ర‌కంగా తెలుగు సినిమా మాకొద్దు అనే నినాదాన్ని తెర‌పైకి తెస్తున్నారు. ఇక్క‌డ తెలుగు సినిమాలు రిలీజ్ అవ్వాల్సిన ప‌నిలేదు. మా సినిమాలు మాకు ఉన్నాయి అన్న ధోర‌ణి స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

ఇప్పుడిదే శాండిల్ వుడ్ స‌హా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆరా తీస్తే భాషా బేధాన్ని తెర‌పైకి తెస్తున్న‌ట్లు వినిపిస్తుంది. పోస్ట‌ర్ పై తెలుగు ఉండ‌ట‌మే క‌న్న‌డిగుల‌కు న‌చ్చ‌లేద‌న్న అంశం తెర‌పైకి వ‌స్తోంది. మా రాష్టంలో తెలుగు పోస్ట‌ర్ ఏంటి ఉంటే క‌న్న‌డ భాష‌లో త‌ప్ప మ‌రే భాష‌లోనూ ఉండ‌కూడ‌ద‌నే వాద‌న వినిపిస్తుంది. మ‌రి ఇంత‌టి ప‌క్ష‌పాతాన్ని క‌న్న‌డిగులు ఎందుకు వెళ్ల‌గ‌క్కుతున్నారు అన్న‌ది అర్దం కాని ప్ర‌శ్న‌.

సంక్రాంతి కానుక‌గా `గేమ్ ఛేంజ‌ర్`, `డాకు మ‌హారాజ్`, `సంక్రాంతి వస్తున్నాం` చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. క‌న్న‌డ‌లోనూ ఈ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మ‌రి ఈ సినిమాపై అక్క‌డ ఎలాంటి ప్ర‌భావం ప‌డుతుందో చూడాలి.

Tags:    

Similar News