కాంతార.. ఈసారి పెద్ద ప్లానే..
ఇప్పటికే భారతీయ సినిమా గౌరవాన్ని పెంచుతూ ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటతో దూసుకెళ్లింది.
సినిమాలు రూపొందించాక అవార్డుల బాట పట్టడం గతంలో సాధారణంగా అనిపించేది. కానీ ఇప్పుడు, ముందుగానే లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని చేరుకునేలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఇది కేవలం బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ విజయం సాధించాలనే ఉద్దేశంతో జరగుతోంది. తాజాగా, హోంబలే ఫిల్మ్స్ అదే దిశగా ముందుకెళ్తూ, కాంతార చాప్టర్ 1 ను ఆస్కార్ రేస్‌లో నిలబెట్టే ప్రయత్నంలో ఉంది.
ఇప్పటికే భారతీయ సినిమా గౌరవాన్ని పెంచుతూ ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటతో దూసుకెళ్లింది. ఆ విజయం తర్వాత దేశవ్యాప్తంగా పలువురు నిర్మాతలు, దర్శకులు ఆస్కార్‌ను లక్ష్యంగా చేసుకుని పనులు మొదలుపెట్టారు. అందులో కంగువ టీమ్ కూడా భారీగా కలలుకంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆస్కార్ రేస్‌లో నిలిచే స్థాయిలో ఉంటుందనిపించినా చివరి వరకు కొనసాగలేకపోయింది.
ఈ తప్పిదాన్ని కాంతార టీమ్ మళ్ళీ చేయదలచుకోలేదు. మొదటి పార్ట్‌తోనే ఆస్కార్ ప్రయత్నం చేయాల్సిందని హోంబలే ఫిల్మ్స్ భావించింది. కానీ అప్పుడు సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఆ అవకాశం మిస్సైంది. ఇప్పుడు మాత్రం అంతా పూర్తిగా ప్లాన్ ప్రకారం సాగుతోంది. కాంతార చాప్టర్ 1 కోసం దాదాపు 500 మంది టీం పనిచేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రతి అంశాన్ని అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రధానంగా యుద్ధ సన్నివేశాలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకోబోతున్నాయి. అందుకోసం రిషబ్ శెట్టి స్వయంగా మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. కళరిపయట్టు, గుర్రపు స్వారీ వంటి కళల్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇది కేవలం యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా ఆస్కార్‌కు అవసరమైన క్రాఫ్ట్‌తో రూపొందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు.
అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం మొదట బాక్సాఫీస్‌ను దున్ని, ఆ తర్వాత ఆస్కార్ బరిలోకి దిగాలని ప్లాన్ చేస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ ఇప్పటికే ఈ విషయంలో అనేక అంతర్జాతీయ మార్కెట్ స్ట్రాటజీలను సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా ఆస్కార్ నిబంధనల ప్రకారం ప్రమోషన్, స్క్రీనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది.
మొత్తానికి, కాంతార చాప్టర్ 1 హోంబలే ఫిల్మ్స్‌కి ఒక కీలకమైన సినిమా కానుంది. ఒకవేళ ఇది ఆశించిన స్థాయిలో ఆడియన్స్‌ను మెప్పిస్తే, వచ్చే ఏడాది ఆస్కార్ రేస్‌లో నిలవడం ఖాయమనే విశ్వాసంతో టీమ్ ముందుకెళ్తోంది. మరి రిషబ్ శెట్టి, హోంబలే ఫిల్మ్స్ లక్ష్యం నిజమవుతుందా, కాంతార మరోసారి దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుందా.. అన్నది వేచి చూడాల్సిందే.