681 శాతం పెంపు.. 'కాంతార 2' బడ్జెట్ స్కైలోకి..!
ఇంతలోనే నవంబర్ 1 నుంచి కాంతార2 నిర్మాతలు మొదటి దశ షూటింగ్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.
రిషబ్ శెట్టి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'కాంతార' శాండల్‌వుడ్ కి కీలక మైలురాయిగా నిలిచింది. జాతీయ స్థాయిలో కన్నడ చిత్రాల రేంజును మెరుగుపరచడంలో ఈ సినిమా దోహదపడింది. ఇప్పుడు కాంతార-1ని మించి కాంతార 2ని నిర్మించాలని నటుడు దర్శకనిర్మాత రిషబ్ ప్లాన్ చేస్తున్నారు. నిజానికి కాంతార కు ప్రీక్వెల్ కథతో రెండో భాగాన్ని రూపొందించనున్నారు. కాంతార 2 అని టైటిల్ వినిపిస్తున్నా ఇది ప్రీక్వెల్ కథాంశంతో రూపొందుతుందని రిషబ్ ఇప్పటికే వెల్లడించారు. తొలి భాగం పెద్ద విజయం సాధించడంతో రెండో భాగంపైనా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజా సమాచారం మేరకు పార్ట్ 1 బడ్జెట్ తో పోలిస్తే రెండో భాగానికి అత్యంత భారీ బడ్జెట్ ని కేటాయించనున్నారని తెలుస్తోంది.
తాజా కథనాల ప్రకారం కాంతార 2కి 125 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారని తెలిసింది. పార్ట్ 1ని 16 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. కానీ ప్రీక్వెల్‌కు దాదాపు 681 శాతం (ఎనిమిదింతలు) బడ్జెట్ అదనంగా పెంచారని కథాలొస్తున్నాయి. నిజానికి సెప్టెంబర్ 2022లో కాంతార విడుదలైనప్పటి నుండి రెండవ భాగం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం ముగింపుతోనే ఇది ఫ్రాంచైజీగా మారుతుందని.. తదుపరి చిత్రాలకు మరిన్ని హంగులు యాడ్ చేయడం ఖాయమని హింట్ ఇచ్చారు మేకర్స్.
చివరికి రిషబ్ శెట్టి పాత్ర శివ .. తన తండ్రి ఆత్మను కలుసుకున్న తర్వాత అడవిలో అదృశ్యమవుతాడు. తరువాత శివ- లీల దంపతుల కొడుకు తన తండ్రి అదృశ్యం గురించి అడుగుతాడు. ఆ ప్రశ్నకు సమాధానం పార్ట్ 2లో తెలుస్తుంది. ఫారెస్ట్ ఆఫీసర్ మురళితో శివ (రిషబ్) గొడవ నేపథ్యంలో రివెంజ్ డ్రామా కథాంశంతో మొదటి భాగం ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించింది. రెండో భాగంలో దీనికి కొనసాగింపు ఉంటుందా లేదా వేచి చూడాలి.
కాంతార 2 సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉండగా.. భారీ బడ్జెట్ కేటాయింపు గురించి సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రీక్వెల్ పై ఎగ్జయిట్ మెంట్ పెరిగేందుకు ఈ ప్రచారం సహకరిస్తోంది. ఇంతలోనే నవంబర్ 1 నుంచి కాంతార2 నిర్మాతలు మొదటి దశ షూటింగ్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. 2024 మొదటి త్రైమాసికంలో షూటింగ్‌ను ముగించాలని .. 2024 చివరి నాటికి విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యాన్ని నిర్ధేశించారు.
కాంతార చిత్రం థియేటర్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా 410 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది కర్ణాటకలో యష్ 'KGF: చాప్టర్ 2' రికార్డును కూడా బద్దలు కొట్టింది. కేజీఎఫ్ అన్ని భాషలు కలుపుకుని 1000 కోట్లు పైగా వసూలు చేయగా.. కర్నాటక వరకూ కాంతార వసూళ్ల పరంగా టాప్ పొజిషన్ కి చేరుకుందని కథనాలొచ్చాయి. 16 కోట్లతో తెరకెక్కిన కాంతార 400 కోట్లు వసూలు చేయగా.. దాదాపు 125 కోట్లతో తెరకెక్కనున్న కాంతార 2 ఏ స్థాయి రికార్డులు అందుకుంటుందో వేచి చూడాలి. 'పుష్ప 2'లానే 'కాంతార 2'తో కుంభాన్ని కొట్టాలని ప్లాన్ చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.