ఆ సినిమా మ‌రో `సాగ‌ర‌సంగ‌మం`మా?

ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ `సాగ‌ర‌సంగ‌మం` గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2024-09-24 04:58 GMT

ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ `సాగ‌ర‌సంగ‌మం` గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. విశ్వ‌నాధ్-క‌మ‌ల్ హాస‌న్ కెరీర్ లోనే కాదు తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అదో గొప్ప క‌ళాఖండం. ఆ లెజెండ‌రీల ఇద్ద‌రి కెరీర్ గురించి చెప్పాల్సి వ‌స్తే సాగ‌ర‌సంగ‌మం ముందు..త‌ర్వాత అని క‌చ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. మ‌ళ్లీ వాళ్లిద్ద‌రు క‌లిసి ప‌నిచేసినా? అలాంటి అద్భుత‌మైన చిత్రం వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం లేద‌ని విశ్వ‌నాధ్ ఎన్నోసార్లు మీడియా ముఖంగా చెప్పారు. ఇక క‌మ‌ల్ హాస‌న్ ఎన్ని సినిమాలు చేసినా? ఎంత మంది ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేసినా? సాగ‌ర‌సంగ‌మం లాంటి సినిమా చేయ‌డం అన్న‌ది పూర్వ జ‌న్మసుకృతంగానే భావించారు.

ఎంతో మంది న‌టులున్నా? ఆ సినిమాలో న‌టించే అవ‌కాశం త‌న‌కు రావ‌డం గొప్ప వ‌రంగా భావించారు. మ‌రి ఇప్పుడీ సినిమా గురించి దేనిక‌నుకుంటున్నారా? అయితే అస‌లు వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. కోలీవుడ్ హీరో కార్తీ త‌న సినిమాను సాగ‌ర‌సంగ‌మం తో పోలిక చేయ‌డమే ఇంత‌టి చ‌ర్చ‌కు దారి తీసింది. కార్తీ, అర‌విద్ స్వామి ప్ర‌ధాన పాత్ర‌ల్లో `స‌త్యం సుంద‌రం `అనే సినిమా తెరకెక్కింది. `96` ఫేం సి. ప్రేమ్ కుమార్ 96 త‌ర్వాత తెర‌కెక్కించిన చిత్ర‌మంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల్ని ఎంత‌గానే ఆక‌ట్టుకున్నాయి.

ఈ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా కార్తీ సినిమా గురించి ఆసక్తిక‌ర‌ వ్యాఖ్య‌లు చేసారు. అవేంటో ఆయ‌న మాట‌ల్లోనే.. `ఈ క‌థ చ‌దువుతున్న‌ప్పుడు చాలా చోట్ల క‌న్నీళ్లు తిరిగాయి. ఇలాంటి క‌థ‌లు ఎలా రాస్తారు అనిపించింది. నాకు కె. విశ్వ‌నాధ్ గారి సినిమాలంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు అలాంటి క‌థ‌లు రావ‌డం లేదు. ఈ క‌థ విన్న‌ప్పుడు విశ్వ‌నాధ్ గారు సినిమాలే గుర్తొచ్చాయి. చాలా అరుదైన స్క్రిప్ట్ ఇది. అన్న‌య్య ఈ క‌థ విని నీకు మాత్ర‌మే ఇలాంటి క‌థ‌లు ఎలా దొరుకుతాయి రా? అన్నారు.

సోద‌రుల్లాంటి రెండు పాత్ర‌ల మ‌ద్య న‌డిచే క‌థ ఇది. `96` లాగే ఒక రాత్రిలో సాగుతుంది. కుటుంబ ప్రేక్ష‌కుల‌కు ఓ కొత్త అనుభూతిని పంచుతుంది. `సాగ‌ర స‌మంగ‌మం` చూసిన‌ప్పుడు ఎలాంటి అనుభూతికి లోన‌వుతారో? అంతే అనూభూతి ఈ సినిమా అందిస్తుంది. మ‌న సంస్కృతి, మూలాలకు సంబంధించిన క‌థ ఇది.

Tags:    

Similar News