ఔట్‌సైడర్ సరసన ఇన్‌సైడర్ బ్యూటీ
బాలీవుడ్ లో ఔట్ సైడర్, ఇన్ సైడర్ డిబేట్ ఈనాటిది కాదు. చాలా సంవత్సరాలుగా నలుగుతున్నదే.
బాలీవుడ్ లో ఔట్ సైడర్, ఇన్ సైడర్ డిబేట్ ఈనాటిది కాదు. చాలా సంవత్సరాలుగా నలుగుతున్నదే. బయటి వ్యక్తులను పరిశ్రమలో ఆదరించకుండా మాఫియా కనుసన్నల్లో కథ నడుస్తుందని క్వీన్ కంగన లాంటి వారు బహిరంగంగా చాలాసార్లు విమర్శించారు. మాఫియా కీలక సభ్యుల్లో కరణ్ జోహార్ ఒకరు అని కంగన స్పష్ఠంగా చెప్పింది. కార్తీక్ ఆర్యన్, ఆయుష్మాన్ ఖురానా లాంటి ఔట్ సైడర్స్ మంచి కథలు, కంటెంట్ తో అనూహ్యంగా బాలీవుడ్ లోకి దూసుకొచ్చారు. ఇన్ సైడర్స్ కి ఇది తలనొప్పి వ్యవహారంగా మారింది. సరైన ఎంపికలు తెలియక, ప్రతిభ లేక ఇన్ సైడర్ హీరోలు, నటవారసులు స్ట్రగుల్ అవుతున్న సమయంలో కార్తీక్, ఆయుష్మాన్ లాంటి హీరోలు న్యూ వేవ్ లా దూసుకొచ్చారు.
అదంతా అటుంచితే తన సినిమా దోస్తానా 2 నుంచి కార్తీక్ ఆర్యన్ ని తొలగించిన కరణ్ జోహార్ ఆ తర్వాత అసలు కార్తీక్ తో సినిమా తీసే ప్రసక్తే లేదని ప్రకటించాడు. కానీ ఇటీవలి కాలంలో కరణ్ పరిస్థితి ఏమంత బాలేదు. తన నిర్మాణ సంస్థను ప్రముఖ కార్పొరెట్ కంపెనీతో మెర్జ్ చేసాడు. తన వాటాను, పని భారాన్ని తగ్గించుకున్నాడు. ఇలాంటి సమయంలో శత్రుత్వం వదిలి వరుస విజయాలతో స్పీడ్ మీద ఉన్న కార్తీక్ ఆర్యన్ తో సినిమా చేసేందుకు ముందుకు వచ్చాడు. కరణ్ జోహార్ - కార్తీక్ ఆర్యన్ కలిసి `తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ` అనే రొమాంటిక్ కామెడీ ని ప్రకటించారు. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ సరసన హీరోయిన్ పేరు ఖరారు అవుతుందనే ఊహాగానాలు చాలానే ఉన్నాయి. తాజా కథనాల ప్రకారం.. అనన్య పాండే ఇందులో కథానాయికగా నటించనుందని తెలుస్తోంది.
నిజానికి ఈ ఎంపిక ఆశ్చర్యకరమైనది. ఇది మరోసారి ఔట్ సైడర్- ఇన్ సైడర్ సమీకరణంపై డిబేట్ ని స్టార్ట్ చేసింది. కార్తీక్ ఆర్యన్ ఔట్ సైడర్ కాగా, అనన్య ఇన్ సైడర్.. ఆ ఇద్దరినీ మాఫియా వ్యక్తి కరణ్ కలిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇది విచిత్రమైన కలయిక! అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అనన్య పాండే ఇటీవల వరుసగా సక్సెస్ అన్నదే లేని ఇన్ సైడర్ హీరోల సరసన నటించింది. చివరికి ఇప్పుడు సక్సెస్ ఉన్న ఔట్ సైడర్ హీరో సరసన అవకాశం అందుకుందని విశ్లేషిస్తున్నారు. కార్తీక్- అనన్య- కరణ్ కాంబినేషన్ మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి. మరోవైపు ఓ అడ్వెంచరస్ లవ్ స్టోరీలో కార్తీక్ ఆర్యన్ సరసన శార్వరి వాఘ్ నటిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే శార్వరికి `పతి పత్ని ఔర్ వో 2`ని కూడా ఆఫర్ చేశారని కథనాలొస్తున్నాయి. అనన్య- కార్తీక్ ఆర్యన్ గతంలో 2019 రొమాంటిక్ కామ్ `పతి పత్ని ఔర్ వో`లో జంటగా నటించారు. కానీ ఈసారి సీక్వెల్‌లో శార్వరికి అవకాశం దక్కనుందని తెలుస్తోంది.