'డార్లింగ్‌' డైరెక్టర్‌ ఇప్పుడేం చేస్తున్నాడు..?

25 ఏళ్ల క్రితం దర్శకుడు కరుణాకరన్‌కి యూత్‌లో మంచి క్రేజ్ ఉండేది.. యంగ్‌ హీరోలు ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపించేవారు.

Update: 2025-02-27 12:30 GMT

25 ఏళ్ల క్రితం దర్శకుడు కరుణాకరన్‌కి యూత్‌లో మంచి క్రేజ్ ఉండేది.. యంగ్‌ హీరోలు ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపించేవారు. కానీ పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో సినిమా అంటే సీనియర్‌ హీరోలు ఆసక్తి చూపడంలేదు, యంగ్‌ హీరోలు భయపడుతున్నారు. 'డార్లింగ్‌' తర్వాత కరుణాకరన్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. 15 ఏళ్లుగా కరుణాకరన్ సక్సెస్‌ చూడలేదు. ఈ 15 ఏళ్లలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు మూడే. ఆ మూడు సినిమాల్లో 'ఎందుకంటే ప్రేమంట' ఒక మోస్తరుగా ఆడిన, చిన్నదాన నీ కోసం, తేజ్ ఐ లవ్‌ యూ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.

తొలిప్రేమ, యువకుడు, వాసు, హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్‌ వంటి విభిన్నమైన ప్రేమ కథా చిత్రాలను అందించిన దర్శకుడు కరుణాకరణ్‌ చివరగా 2018లో 'తేజ్ ఐ లవ్‌ యూ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సాయి ధరమ్‌ తేజ్ హీరోగా నటించిన ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. దాంతో కరుణాకరన్‌ కనిపించకుండా పోయారు. చాలా కాలం తర్వాత మళ్లీ టాలీవుడ్‌లో ఆయన పేరు వినిపిస్తుంది. ప్రస్తుతం దిల్‌ రాజు కాంపౌండ్‌లో కరుణాకరన్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. దిల్‌ రాజు కాంపౌండ్‌ హీరో అయిన ఆశీష్‌తో కరుణాకరన్‌ ఒక సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నారు.

హీరోగా ఆశీష్ సక్సెస్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. గత ఏడాది మొదలు పెట్టిన సెల్ఫిష్‌ మూవీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ సినిమా పూర్తి అయ్యి విడుదల అయ్యేనా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. ఈ సమయంలోనే ఆశిష్‌ హీరోగా కరుణాకరన్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు సినిమాకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు చెప్పిన స్టోరీ లైన్‌కి దిల్‌ రాజు ఓకే చెప్పారు. ఆశీష్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా సినిమా కథను, స్క్రిప్ట్‌ను రెడీ చేయమని దిల్‌ రాజు చెప్పాడని, ప్రస్తుతం కరుణాకరన్‌ అదే పనిలో ఉన్నారని తెలుస్తోంది. మంచి ప్రేమ కథను ఆశీష్‌తో కరుణాకరన్‌ ప్లాన్‌ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

ఈతరం ప్రేక్షకులకు కరుణాకరన్‌ సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదు. ఈ జనరేషన్‌కి తగ్గట్లు ఆయన సినిమాను తీయగలరా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు అన్ని విధాలుగా ఆలోచించి, స్క్రిప్ట్‌ వర్కౌట్‌ అవుతుంది అనుకున్న తర్వాతే సెట్స్‌పైకి తీసుకు వెళ్తారు. కనుక ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమా కథను రెడీ చేస్తేనే ఆశీష్‌ హీరోగా కరుణాకరన్‌ సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. దిల్‌ రాజు మెచ్చే విధంగా దర్శకుడు కరుణాకరన్‌ కథను రెడీ చేసేనా అనేది చూడాలి. ప్రస్తుతానికి దిల్ రాజు కాంపౌండ్‌లోనే కరుణాకరన్‌ కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దిల్‌ రాజుకు ఫైనల్‌ నరేషన్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News