కస్తూరి కేసు: అప్పటివరకు జైలులోనే..
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రముఖ నటి కస్తూరి అరెస్టు కావడం తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రముఖ నటి కస్తూరి అరెస్టు కావడం తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. చెన్నై పోలీసులు ఇటీవలే ఆమెను హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక అరెస్టు చేసిన వెంటనే ఆమెను చెన్నైకి తరలించారు. ఇక రీసెంట్ గా ఈ కేసులో ఎగ్మోర్ కోర్టు నటి కస్తూరికి ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను చెన్నై ఫుళల్ సెంట్రల్ జైలుకు తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
కేసు నేపథ్యంలో కస్తూరి ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో చెన్నై పోలీసులు ఆమె అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. కానీ కస్తూరి అంత ఈజీగా వారికి దొరకలేదు. చెన్నైలోని కస్తూరి ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ కావడం పోలీసులకు కాస్త కష్టంగా మారింది. దీనితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్‌లో ఆమె కోసం గాలించారు. ఫైనల్ గా ఆమెను అరెస్టు చేశారు.
ఈ వివాదానికి కారణమైన సంఘటనలు కొన్ని రోజుల క్రితం జరిగిన ‘హిందూ మక్కల్ కచ్చి’ సభలో చోటుచేసుకున్నాయి. ఈ సభలో కస్తూరి చేసిన వ్యాఖ్యలు ద్రవిడ పార్టీలను టార్గెట్ చేయడమే కాక, తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలుగా భావించబడ్డాయి. కస్తూరి మాట్లాడుతూ, ద్రవిడ పార్టీలు బ్రాహ్మణులను పరాయివాళ్లుగా చూడడం సరికాదని, అప్పుడు రాజుల సమయాల్లో రాజదరబార్‌లో పని చేసేందుకు వచ్చిన తెలుగువారిని తమవారిగా చూస్తూ, బ్రాహ్మణులను ప్రత్యేకంగా చూడటం ఏమిటని ప్రశ్నించారు.
అలాగే తెలుగు వారు సేవ్ చేసేందుకే ఇక్కడికి వచ్చి అంతా తమదే అన్నట్లు కొనసాగుతున్నారని ఆమె కఠినంగా స్పందించారు. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తెలుగు ప్రజల ఆగ్రహానికి గురవడంతో, కస్తూరి తన వ్యాఖ్యలను సవరించుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. తన ఉద్దేశం తెలుగువారిని అవమానించడమేమీ కాదని, కేవలం ద్రవిడ పార్టీల బ్రాహ్మణ వ్యతిరేక ధోరణిని ప్రశ్నించానని చెప్పింది.
అయినప్పటికీ, ఈ వివరణ ఆమెను వివాదం నుండి కాపాడలేకపోయింది. ఈ కేసు ఇప్పుడు రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. కస్తూరి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడం, పోలీసులు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం తమిళనాడులో పెద్ద చర్చకు దారితీసింది. తాజా పరిణామాలను చూస్తుంటే, ఈ వివాదం త్వరగా ముగిసేలా లేదు. మరి కస్తూరి కేసు వివాదంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.