కొరియన్ సహా 14 భాషల్లో అనుష్క మూవీ!
మలయాళంలో రూపొందుతున్న ఈ సినిమాను కేవలం ఇండియన్ భాషల్లోనే కాకుండా మొత్తం 14 భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు.
సుదీర్ఘ గ్యాప్ తర్వాత అనుష్క ఒకే సారి రెండు సినిమాల్లో నటిస్తూ ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేసింది. ఇటీవలే క్రిష్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన 'ఘాటీ' టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి షాక్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో అనుష్కను మరీ వైల్డ్‌గా చూసి అంతా షాక్ అయ్యారు. బాబోయ్ అనుష్క ను మరీ ఇంతటి వైల్డ్ యాంగిల్‌లో చూడగలమా అనుకున్న వారు సైతం టీజర్‌లో ఆమె నటనకు ఫిదా అవుతున్నారు. ఘాటీ సినిమా తో పాటు అనుష్క నటిస్తున్న మరో సినిమా 'కటనార్ : ది వైల్డ్ సోర్సెరర్'. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ అద్భుతంగా ఉంటాయని, విజువల్ వండర్‌గా సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
ఈ సినిమా కోసం ఇప్పటి వరకు ఏ సౌత్ ఇండియన్ మూవీకి వేయని భారీ సెట్ ను వేయనున్నారట. 45 వేల చదరపు అడుగల విస్తీర్ణంలో కటనార్ కోసం సెట్ నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. మలయాళంలో రూపొందుతున్న ఈ సినిమాను కేవలం ఇండియన్ భాషల్లోనే కాకుండా మొత్తం 14 భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇంగ్లీష్, బెంగాలీ, చైనీస్, ఫ్రెంచ్, కొరియన్, ఇటాలియన్ భాషలతో పాటు మరికొన్ని విదేశీ భాషల్లోనూ సినిమాను విడుదల చేయబోతున్నారు. 14 భాషల్లో ఈ సినిమాను తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో ముందు నుంచే డబ్బింగ్, ఇతర విషయాల గురించిన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఈ మధ్య కాలంలో హర్రర్ కాన్సెప్ట్ సినిమాలకు మంచి స్పందన వచ్చింది. స్త్రీ 2 సినిమాతో పాటు భూల్ భులయ్యా సినిమా సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అదే జోనర్ లో రాబోతున్న కటనార్ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాలో అనుష్క పాత్ర ఏంటి, ఇతర నటీనటుల పాత్రలు ఏంటి అనే విషయంలో సినిమా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విభిన్నమైన కాన్సెప్ట్ తో పాటు, భారీ విజువల్ వండర్‌గా సినిమాను రూపొందిస్తున్న నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
రోజిన్ థామస్ ఈ సినిమాను దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు. షూటింగ్ దాదాపుగా పూర్తి అయిందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. ఈ మధ్య కాలంలో అనుష్క సినిమాలు రాకపోవడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అంటూ ప్రతి ఒక్కరు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. భారీ వసూళ్లు టార్గెట్ తో రాబోతున్న ఈ సినిమా తో అనుష్క మరోసారి తన పాన్ ఇండియా స్టార్‌డం ను నిరూపించుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.