రాజ‌మౌళితో SSMB29పై కీర‌వాణి లీక్

కీర‌వాణి ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మ‌హేష్ బాబు- రాజ‌మౌళి చిత్రం గురించి ఆస‌క్తిక‌ర అప్‌డేట్ ని అందించారు. బౌండ్ స్క్రిప్టు ఇప్పుడే రాయడం పూర్తయిందని కీర‌వాణి వెల్లడించారు.

Update: 2024-06-23 07:36 GMT

RRR తర్వాత SS రాజమౌళి త‌దుప‌రి చిత్రంపైనే అంద‌రి దృష్టి నిలిచి ఉంది. మ‌హేష్ తో SSMB29 ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఇది ఈ అరుదైన‌ జోడీ మొద‌టి క‌ల‌యిక కావ‌డంతో మ‌రింత ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టికే వెల్ల‌డైన వివ‌రాల ప్ర‌కారం.. ఈ సినిమా క‌థాంశం బ్లాక్ బ‌స్ట‌ర్ హాలీవుడ్ మూవీ 'ఇండియానా జోన్స్' థీమ్ లైన్స్ లో ఉంటుంది. డాన్ బ్రౌన్ నవలలు త‌మ‌కు స్ఫూర్తి అని రాజ‌మౌళి-విజయేంద్ర ప్ర‌సాద్ గ‌తంలో వెల్ల‌డించారు. ఇది ఒక ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ మూవీ. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ MM కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.

కీర‌వాణి ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మ‌హేష్ బాబు- రాజ‌మౌళి చిత్రం గురించి ఆస‌క్తిక‌ర అప్‌డేట్ ని అందించారు. బౌండ్ స్క్రిప్టు ఇప్పుడే రాయడం పూర్తయిందని కీర‌వాణి వెల్లడించారు. ''ఈ వారం స్క్రిప్టును లాక్ చేస్తున్నాం. కాబట్టి నేను ఇంకా పనిని ప్రారంభించలేదు. కొన్ని టెస్ట్ షూట్‌లు జరుగుతున్నాయి''అని తెలిపిన‌ట్టు న్యూస్ 18 త‌న క‌థ‌నంలో పేర్కొంది. ప్ర‌స్తుతం వేరొక సినిమాకి సంగీతం అందిస్తున్నాన‌ని, జూలై-ఆగస్టులో మ‌హేష్‌ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చే పనిని ప్రారంభిస్తానని కీర‌వాణి ఈ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు.

RRR 'నాటు నాటు' ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేట‌గిరీలో ఆస్కార్ - గోల్డెన్ గ్లోబ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ పుర‌స్కారాల‌ను గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. ఆస్కార్ విన్నింగ్ పాటకు స్వ‌ర‌క‌ర్త‌గా కీర‌వాణి చరిత్ర సృష్టించారు. నాటు నాటు త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి ఒక మెరుపు లాంటి పాట‌ను సృజిస్తారా? అని ప్ర‌శ్నిస్తే.. కీర‌వాణి స‌మాధానం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. నాటు నాటు ఒక ప్రత్యేకమైన పాట..మరొక నాటు నాటును సృష్టించడం సాధ్యం కాదని కీర‌వాణి చెప్పారు. ఇప్పటి వరకు తమ సినిమాలకు నాటు నాటు వంటి పాటలు చేయమని ద‌ర్శ‌కులెవరూ అడ‌గ‌లేదు. నాటు నాటు RRR కోసం ప్రత్యేకమైనది. సంద‌ర్భానుసారం వ‌చ్చే సాంగ్ అది. ఇది కేవలం పాట మాత్రమే కాదు.. సినిమాలోని కథను న‌డిపించింది. అలాంటి సంద‌ర్భాన్ని సృష్టించ‌గ‌లిగేవారు త‌ప్ప‌ ఇత‌ర ద‌ర్శ‌కులెవ‌రూ మరో 'నాటు నాటు..' చేయమని నన్ను అడగలేరు! అని కూడా కీర‌వాణి వ్యాఖ్యానించారు.

95వ అకాడమీ అవార్డ్స్‌లో విజేత‌గా నిలిచాక జీవితంలో లేదా కెరీర్‌లో ఏదైనా మార్పు వచ్చిందా? అని కీర‌వాణిని ప్ర‌శ్నించ‌గా.. ఆస్కార్ వ‌చ్చినా త‌న‌ జీవితం మారలేదని అన్నారు. వ్య‌క్తిగ‌త జీవితం వేరు.. వృత్తిగ‌త జీవితం వేర‌ని అన్నారు. నేను ఒక మాల్‌కి వెళ్లి డైరీ మిల్క్ చాక్లెట్ - మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్ అడిగాను. నేను వాటిని తీసుకొని వెళ్లేప్పుడు షాపు వాళ్లు నన్ను డబ్బు అడిగారు. నేను ఆస్కార్‌ను గెలుచుకున్నాను.. కాబట్టి చెల్లించవ‌ద్ద‌ని అన‌లేదు! అని ఛ‌మ‌త్క‌రించారు. ఆస్కార్ గెలవడం వల్ల జీవితంలో ఎటువంటి తేడా లేదు. నేను కొన్నదానికి చెల్లించాలి! అని కీర‌వాణి నవ్వుతూ చెప్పారు. నీరజ్ పాండే మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరి 'ఆరోన్ మే కహన్ దమ్ థా'కు కీర‌వాణి సంగీతం అందించారు. అజ‌య్ దేవ‌గ‌న్- ట‌బు ఈ చిత్రంలో తారాగ‌ణం.

Tags:    

Similar News