మ్యూజిక్ డైరెక్టర్‌తో ట్యాలెంటెడ్ నటి పెళ్లిపై క్లారిటీ
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కీర్తి తన ప్రేమ, సంబంధాలు, సంబంధిత విషయాల గురించి మాట్లాడుతూ కనిపించింది.
అందాల కథానాయిక కీర్తి సురేష్ కెరీర్ జర్నీ గురించి తెలిసిందే. మహానటి సావిత్రి పాత్రలో అద్భుత నటన కనబరిచిన కీర్తి కమర్షియల్ సినిమాల్లో గ్లామరస్ నాయికగాను మెప్పించింది. వినోద పరిశ్రమలో అత్యంత బిజీ నటిగా కొనసాగుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కీర్తి తన ప్రేమ, సంబంధాలు, సంబంధిత విషయాల గురించి మాట్లాడుతూ కనిపించింది.
తన ఆదర్శ జీవిత భాగస్వామి ఎలా ఉండాలనే దాని గురించి ప్రశ్నించగా, దానికి కీర్తి బదులిస్తూ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలని.. ఒకరినొకరు అర్థం చేసుకునే మంచి స్నేహితులుగా ఉండాలని కీర్తి వ్యాఖ్యానించారు. అదే క్రమంలో తన స్నేహితుడు అనిరుధ్ రవిచంద్రన్ ని కీర్తి పెళ్లాడేస్తోందని కూడా ప్రచారం సాగిపోయింది. పలుమార్లు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ తో ముడిపెడుతూ మీడియాలో కథనాలొచ్చాయి. కానీ అవన్నీ కేవలం రూమర్లు మాత్రమేనని ప్రూవ్ అయింది.
నిజానికి కీర్తి సురేష్ వ్యక్తిగత జీవితంపై అభిమానుల్లో చాలా కాలంగా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సంగీత స్వరకర్త అనిరుధ్ రవిచందర్‌తో కీర్తి సంబంధం గురించి చాలా పుకార్లు ఉన్నాయి. సోషల్ మీడియాలో వారి వివాహం గురించి ఊహాగానాలు ఉన్నాయి. కానీ తాజా చాటింగ్ సెషన్ లో మరోసారి వాటిని కీర్తి కొట్టి పారేసింది. ``ఇది తప్పుడు వార్త, అనిరుధ్ నాకు స్నేహితుడు మాత్రమే``నని తెలిపింది. తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోను అని స్పష్టం చేసింది. ఆమె తండ్రి కూడా పుకార్లను తోసిపుచ్చారు.
కీర్తి 2024లో నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తమిళంలో `రఘు తాత` అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే రివాల్వర్ రీటా, కన్ని వేడి, బేబి జాన్ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటికి సంబంధించిన తాజా అప్ డేట్ తెలియాల్సి ఉంది. బ్లాక్ బస్టర్ `కల్కి 2898 ఏడి`లో కీర్తి సురేష్ అతిథి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.