సైఫ్ పై కత్తితో దాడి... తెల్లవారుజాము 2:30 నుంచి ఏమి జరిగింది?
సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి మరీ అతడిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (54) పై ముంబైలో ఆయన ఉంటున్న ఇంట్లోకి చొరబడిన దుండగుడు కత్తితో పలుమార్లు దాడి చేసిన ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనతో దేశంలోని యావత్ సినీ పరిశ్రమ షాక్ కి గురయ్యింది. ఇదే సమయంలో ముంబైలో ప్రముఖుల భద్రత విషయంపై మరోసారి కీలక చర్చ తెరపైకి వచ్చింది.
అవును.. సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి మరీ అతడిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమయంలో అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
అసలు ఏం జరిగింది.. ఎలా జరిగింది..?:
బాంద్రలోని సద్గురు శరణ్ అపార్ట్ మెంట్ 12వ అంతస్తులో సైఫ్ అలీఖాన్ ఉంటున్నారు. టాప్ సెలబ్రెటీస్ ఉండే ఈ అపార్ట్ మెంట్ లో చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుందని చెబుతారు. ఈ ఇంట్లో సైఫ్ తో పాటు కరీనా కపూర్, జేహ్ (4), తముర్ (8) ఉన్నారు. వీరితో పాటు ఐదుగురు సహాయకులు ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో దుండగుడు జేహ్ గదిలోకి దొంగచాటుగా ప్రవేశించాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న జేహ్ సహాయకురాలు ఎలియామా ఫిలిప్ ను కోటి రూపాయలు డిమాండ్ చేశాడు. ఆ సమయంలో దుండగుడి వద్ద కర్ర, హెక్సా బ్లేడ్ తో పాటు కత్తి కూడా ఉన్నట్లు ఫిలిప్ తెలిపింది. ఆమె ప్రతిఘటించడంతో బ్లేడ్ తో ఆమె చేతిని గాయపరిచాడు.
ఈ సమయంలో శబ్ధాలు వినిపించడంతో జేహ్ ఉన్న గదికి వచ్చాడు సైఫ్ అలీఖాన్. ఇది గమనించిన దుండగుడు.. సైఫ్ పై కత్తి, హెక్సా బ్లేడ్ తో దాడి చేశాడు. ఈ సందర్భంగా ఆయనకు ఆరు చోట్ల గాయాలు కాగా.. ఒకటి వెన్నెముకకు దగ్గరగా అయ్యిందని చెబుతున్నారు. అనంతరం.. అలారం మోగించడంతో దుండగుడు అక్కడ నుంచి పరారయ్యాడు. అనంతరం సైఫ్ ను ఆటోలో ఆస్పత్రికి తరలించారు.
ఈ సమయంలో సైఫ్ కు అత్యవసర శస్త్రచికిత్సలు చేసిన లీలావతి ఆస్పత్రి వైద్యులు.. అతని శరీరం నుంచి 2.5 అంగుళాల బ్లేడ్ ముక్కను బయటకు తీసినట్లు చెబుతున్నారు. ఈ స్పందర్భంగా స్పందించిన లీలావతి ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నీరజ్ ఉత్తమాని.. సైఫ్ కు ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు.
నిందితుడు ఇతడే... దొరికేశాడు!:
తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సేకరించిన సీసీ టీవీ ఫుటేజ్ లో దుండగుడు దాడి అనంతరం మెట్ల మీదుగా పారిపోయినట్లు గుర్తించారు. తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ఆరో అంతస్తులోని మెట్లవద్ద నిందితుడి చిత్రాలు లభించినట్లు చెబుతున్నారు. పోలీసులు అతడి చిత్రాలు విడుదల చేశారు.
ఈ క్రమంలో... బృందాలుగా ఏర్పడి అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో... అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడిని అదుపులోకి తీసుకున్న అనంతరం బాంద్రా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారిస్తున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
డీసీపీ కీలక వ్యాఖ్యలు!:
సైఫ్ పై దాడి కేసును దర్యాప్తు చేస్తున్న బృందంలో భాగమైన ముంబై జోన్ 9 డీసీపీ దీక్షిత్ గెడమ్ మాట్లాడుతూ.. ఈ ఘటన పూర్తిగా దోపిడీ కోసం చేసిన ప్రయత్నంగానే కనిపిస్తుందని అన్నారు. ఈ సమయంలో నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించడానికి ఫైర్ ఎస్కేప్ మెట్లను ఉపయోగించారని చెప్పారు. ఈ కేసు కోసం 10 డిటెక్షన్ బృందాలు పని చేస్తున్నాయని గెడమ్ తెలిపారు.
ఆన్ లైన్ వేదికగా స్పందించిన కరీనా!:
ఈ సందర్భంగా సైఫ్ సతీమణి, నటి కరీనా కపూర్ స్పందించారు. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా... తమ కుటుంబానికి ఇది ఎంతో సవాలుతో కూడుకున్న రోజని.. ఈ క్లిష్ట సమయంలో మద్దతుగా నిలిచినవారు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అసలు ఏమి జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సమయంలో ఊహాజనిత కథనాలు ప్రసారం చేసే విషయంలో మీడియా వర్గాలు, ఫ్రీలాన్సర్లు సంయమనం పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన నుంచి తేరుకునేందుకు వీలుగా తమ కుటుంబానికి కొంత వ్యక్తిగత సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నట్లు ఆమె తెలిపారు.