పార్ట్ 3 ప్రకటన కోసం ఎదురు చూపులు
కన్నడ సినిమా పరిశ్రమ స్థాయిని పెంచిన సినిమా కేజీఎఫ్ అనడంలో సందేహం లేదు. అంతకు ముందు వరకు కన్నడ సినిమాలు రూ.50 కోట్లు వసూళ్లు చేస్తే బ్లాక్ బస్టర్‌గా చెప్పుకునే వారు, వంద కోట్ల వసూళ్లు అనేది కన్నడ సినిమా ఇండస్ట్రీలో అసాధ్యం అనే అభిప్రాయం ఉండేది.;

కన్నడ సినిమా పరిశ్రమ స్థాయిని పెంచిన సినిమా కేజీఎఫ్ అనడంలో సందేహం లేదు. అంతకు ముందు వరకు కన్నడ సినిమాలు రూ.50 కోట్లు వసూళ్లు చేస్తే బ్లాక్ బస్టర్‌గా చెప్పుకునే వారు, వంద కోట్ల వసూళ్లు అనేది కన్నడ సినిమా ఇండస్ట్రీలో అసాధ్యం అనే అభిప్రాయం ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి ఒక్కసారిగా పరిస్థితులు మార్చేసిన ఘనత కేజీఎఫ్ సినిమాకు దక్కుతుంది. తక్కువ సమయంలోనే కేజీఎఫ్ సినిమా కన్నడ సినిమా మార్కెట్‌ను అమాంతం పెంచేసింది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా కన్నడ సినిమా చరిత్రలో నిలిచి పోయింది.
కేజీఎఫ్ మొదటి పార్ట్ సూపర్ హిట్ అయితే, కేజీఎఫ్ రెండో పార్ట్ ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించడం ద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కన్నడ సినిమా స్థాయిని నిలబెట్టింది. కన్నడ సినిమా ఇండస్ట్రీలోనే సత్తా ఉంది, వందల కోట్ల బడ్జెట్ సినిమాలు చేయడం, అంతకు మించి వసూళ్లు సాధించడం కన్నడ సినిమాలకు సైతం సాధ్యమే అనే అభిప్రాయం కలిగించే విధంగా కేజీఎఫ్ 2 సినిమా నిలిచింది. కేజీఎఫ్ 2 సినిమా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సమయంలో కచ్చితంగా కేజీఎఫ్ 3 సినిమా వస్తుందని మేకర్స్ ప్రకటించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా మరో సినిమా ఉంటుందని, అది కేజీఎఫ్ 3 అనే ప్రచారం జరిగింది.
కేజీఎఫ్ 2 సినిమా విడుదలైన ఏడాది దాటినా యశ్ కొత్త సినిమాను కమిట్ కాకపోవడంతో చాలా మంది ప్రశాంత్ నీల్‌తోనే తదుపరి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఆలస్యం చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. యశ్ కొత్త సినిమాను చేస్తున్నాడు. టాక్సిక్ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఆ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమా గురించి కంటే ఎక్కువగా కేజీఎఫ్ 3 సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఇటీవల కేజీఎఫ్ సినిమా విడుదలై మూడు ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆ సమయంలో చాలా మంది కేజీఎఫ్ 3 ఎప్పుడు అంటూ సోషల్ మీడియా ద్వారా మేకర్స్‌ను పెద్ద ఎత్తున ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో డ్రాగన్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది సమ్మర్ వరకు సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ సినిమాను రెండు పార్ట్‌లుగా చేస్తే కచ్చితంగా వచ్చే ఏడాది మొత్తం అదే పనిలో ఉంటాడు. ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్న ఈ సమయంలోనే ప్రభాస్ సలార్ 2 సినిమాను సైతం ప్రశాంత్ నీల్ చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో లేదా 2027లో ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న సలార్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని సినిమాలు లైన్ లో ఉన్న కారణంగా కేజీఎఫ్ 3 సినిమా ఎప్పుడు అనేది చెప్పలేం. కానీ కచ్చితంగా వీరిద్దరి కాంబోలో మూడో మూవీ ఉంటుందనే విశ్వాసం మాత్రం కన్నడ సినీ ప్రేమికుల్లో ఉంది. అప్పటి వరకు మూడో పార్ట్ కోసం ఎదురు చూస్తూనే ఉంటామని వారు చెబుతున్నారు.