యష్ టాక్సిక్ కు కొత్త తలనొప్పి
టాక్సిక్ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అయితే కెజిఎఫ్3పై ఫ్యాన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటం వల్ల టాక్సిక్ పై బజ్ బాగా తక్కువగా ఉంది.;

కన్నడ సినీ పరిశ్రమ స్టేటస్ ను ఒక్క సారిగా మార్చేసిన సినిమా కెజిఎఫ్. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఈ సినిమా రాకముందు వరకు రూ.50 కోట్ల కలెక్షన్లు అందుకున్న సినిమాలను కూడా శాండల్‌వుడ్‌లో హిట్ సినిమాలుగా చెప్పుకునేవారు. కన్నడ ఇండస్ట్రీలో ఒక సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేయడమనేది కెజిఎఫ్ రాకముందు వరకు అసాధ్యంగానే ఉంది. కానీ కెజిఎఫ్ సినిమా ఆ హద్దులన్నింటినీ చెరిపేసింది.
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ మూవీ కన్నడ సినీ ఇండస్ట్రీని నేషనల్ లెవెల్ కు తీసుకెళ్లింది. కెజిఎఫ్ హిట్ మంచి సక్సెస్ ను అందుకుంటే, కెజిఎఫ్2 దాన్ని మించి ఏకంగా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసి, కన్నడ ఇండస్ట్రీ కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి కంటెంట్ తో పాటూ భారీ సినిమాలను అందించగలదని నిరూపించింది.
కెజిఎఫ్2 సక్సెస్ శాండిల్‌వుడ్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచడంతో పాటూ కన్నడ పరిశ్రమ కూడా దేశంలోని స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడగలదని ప్రూవ్ చేసింది. కెజిఎఫ్2 సూపర్ హిట్ తర్వాత ఆ సినిమాకు కొనసాగింపుగా కెజిఎఫ్3 కూడా ఉంటుందని, మరోసారి ప్రశాంత్ నీల్, యష్ కలిసి సినిమా చేయనున్నారని మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే యష్ ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాక్సిక్ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అయితే కెజిఎఫ్3పై ఫ్యాన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటం వల్ల టాక్సిక్ పై బజ్ బాగా తక్కువగా ఉంది. రీసెంట్ గా కెజిఎఫ్2 రిలీజై మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఫ్యాన్స్ కెజిఎఫ్3కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ అప్డేట్స్ అడుగుతున్నారు.
అయితే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. డ్రాగన్ అయిపోగానే ప్రభాస్ తో కలిసి సలార్2 ను చేయాలని చూస్తున్న నీల్, కెజిఎఫ్3 ను ఎప్పుడు మొదలుపెడతాడో కూడా ఇంకా తెలియదు. కానీ యష్ ఫ్యాన్స్ మాత్రం టాక్సిక్ ను వదిలేసి మరీ కెజిఎఫ్3 అప్డేట్ అడుగుతున్నారు. కేవలం కెజిఎఫ్3 మాత్రమే యష్ స్టార్‌డమ్ ను ముందుకు తీసుకెళ్తుందని, టాక్సిక్ సినిమాకు అంత సామర్థ్యం లేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏదేమైనా టాక్సిక్ కు కెజిఎఫ్3 పెద్ద తలనొప్పిగా మారిందనేది మాత్రం నిజం.