హతవిధీ.. డెబ్యూ నటి ఏకపాత్రాభినయమా?
ఏక పాత్రాభినయంతో మెప్పించడం అనేది నటసార్వభౌములకు మాత్రమే సాధ్యం. కానీ ఇటీవలి కాలంలో కొత్తతరం నటీనటులు కూడా ఇలాంటివి ప్రయత్నిస్తున్నారు
ఏక పాత్రాభినయంతో మెప్పించడం అనేది నటసార్వభౌములకు మాత్రమే సాధ్యం. కానీ ఇటీవలి కాలంలో కొత్తతరం నటీనటులు కూడా ఇలాంటివి ప్రయత్నిస్తున్నారు. ఇంతకముందు కార్తీక్ ఆర్యన్ లాంటి నవతరం హీరో `ప్యార్ కా పంచనామా`లో ఇలాంటి ఒక సుదీర్ఘమైన స్పీచ్ (డైలాగ్) ఉన్న సీన్ ట్రై చేసాడు. అది బాగానే వర్కవుటైంది. కొన్ని నిమిషాల పాటు సాగే సీన్ ని రక్తి కట్టించాడు తన ప్రతిభతో.
ఇంతకుముందు జాన్వీకపూర్ కూడా ఈ తరహా సన్నివేశంలో నటించింది. కానీ ఇప్పుడు ఖుషీ కపూర్ అలాంటి ఒక మోనోలాగ్ సీన్ లో నటించి మెప్పించగలదా? పైగా ఎనిమిది నిమిషాల నిడివితో సాగే సీన్ లో ఖుషీ కపూర్ అన్ స్టాపబుల్ గా ఆడియెన్ ని ఆకట్టుకునే ప్రదర్శన ఇస్తుందా? అన్నది చర్చగా మారింది. ఖుషీ నటిస్తున్న లవ్యాపా అనే రొమాంటిక్ కామెడీలో ఇలాంటి ఛాన్స్ తనకు దక్కింది.
ది ఆర్చీస్ వెబ్ సిరీస్ తో పరిచయమైన ఖుషీ కపూర్ డెబ్యూ నటనకు అంతగా పేరు రాలేదు. ప్రారంభం అనుభవ లేమి స్పష్ఠంగా కనిపించింది. ఇప్పుడు కూడా వెండితెరపై మొదటి సినిమాలోనే ఏక పాత్రాభినయంలో సుదీర్ఘ స్పీచ్ తో సీన్ చేయడం అనేది ఆలోచింపజేస్తోంది. పైగా ఇది ఒక రొమాంటిక్ కామెడీ. సుదీర్ఘ సన్నివేశంలో నటించే అవకాశం లభించింది కనుక సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సినిమాకి అద్వైత్ చందన్ దర్శకుడు కాగా, అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కథానాయకుడు. తెలుగు సినిమా `లవ్ టుడే` ఆధారంగా హిందీలో రూపొందింది.
లవ్‌యాపా మోడ్రన్ డే లవ్ స్టోరీని తెరపై ఆవిష్కరిస్తుంది. ఖుషీ ఏకపాత్రాభినయంతో మెప్పించడమే కాదు, సినిమా ఆద్యంతం తనదైన నటనతో మెరిపించాల్సి ఉంటుంది. నటనలో హావభావాలలో తన తల్లి శ్రీదేవితో పోల్చి చూడలేరు కానీ, కనీసం తన సోదరి జాన్వీ మాదిరిగా అయినా ఖుషీ కపూర్ ప్రయత్నించాల్సి ఉంటుందేమో!