యంగ్ హీరో ఏడాది గ్యాప్.. అసలు విషయం ఇదే!
ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోలుగా పరిచయం అయిన వారు చాలా తక్కువ మంది ఉంటారు.
ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోలుగా పరిచయం అయిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో కిరణ్ అబ్బవరం ఒకరు. చిన్న సినిమా 'రాజా వారు రాణి గారు' తో ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టిన కిరణ్ అబ్బవరం తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు దక్కించుకున్నారు. మొదటి సినిమా పర్వాలేదు అన్నట్లుగా నిలువగా, రెండో సినిమా ఎస్‌ఆర్ కళ్యాణ మండపం మంచి టాక్ సొంతం చేసుకోవడంతో పాటు, నటుడిగా కిరణ్ అబ్బవరంకు మంచి మార్కులు తెచ్చి పెట్టింది. దాంతో వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోయాడు.
కరోనా సమయంలో కాస్త స్లో అయినా గత ఏడాది, అంతకు ముందు ఏడాది వరుసగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. గత రెండేళ్ల కాలంలో కిరణ్ అబ్బవరం నుంచి ఏకంగా ఆరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ ఆరు సినిమాల్లో ఒకటి రెండు కాస్త పర్వాలేదు అనిపించినా ఇతర సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. ముఖ్యంగా కిరణ్ చివరిగా వచ్చిన రూల్స్ రంజన్ సినిమాతో వచ్చారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ సినిమా ప్రమోషన్ సమయంలోనే కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నాను, బ్రేక్ తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు.
రూల్స్ రంజన్ సినిమా ప్రమోషన్ విషయంలోనే కిరణ్ అబ్బవరంకు ఫలితం గురించి అర్థం అయినట్లుంది. అందుకే తన తదుపరి సినిమా కోసం ఏడాది గ్యాప్ తీసుకుంటాను అన్నాడు. అన్నట్లుగానే ఏడాది కాలంగా ఆయన నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఎట్టకేలకు 'క' అనే విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా తన గత చిత్రాల ఫ్లాప్స్ పై, ఏడాది గ్యాప్ పై స్పందించాడు. వరుసగా సినిమాలకు కమిట్ అవ్వడం వల్ల కొత్త లుక్ లో కనిపించే అవకాశం రాలేదు. అంతే కాకుండా కొత్త తరహా కథలు ఎంపిక చేసుకోలేక పోయాను.
వరుసగా సినిమాలు చేసిన నేను తప్పులు సరిదిద్దుకోవాలని అనుకున్నాను. అందుకే ఏడాది గ్యాప్ తీసుకున్న తర్వాతే సినిమాను చేయాలని భావించాను. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావడం వల్ల నేను చేయాలనుకున్నది చేయలేక పోయాను. అందుకే ఏడాది టైం తీసుకుని కొత్త సినిమాతో రాబోతున్నాను. ఈ సినిమాతో నా లుక్ సైతం మార్చుకున్నాను. తప్పకుండా నా నుంచి ప్రేక్షకులు ఆశించే ఎలిమెంట్స్ ను ఈ కొత్త సినిమాతో ఇవ్వబోతున్నట్లు కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు. నేను బాగుండాలి, నా నుంచి మంచి సినిమాలు రావాలని కోరుకునే ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా 'క' సినిమా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'క' ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.