‘క’ నచ్చకపోతే సినిమాలు వదిలేస్తా: కిరణ్ అబ్బవరం
ఇందులో కిరణ్ అబ్బవరం కాస్తా ఎమోషనల్ గా మాట్లాడారు దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు అతని గురించే చర్చ నడుస్తోంది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘క’ మూవీతో అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న చిత్రం కావడంతో కచ్చితంగా ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేస్తుందని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతోంది. తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో కిరణ్ అబ్బవరం కాస్తా ఎమోషనల్ గా మాట్లాడారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు అతని గురించే చర్చ నడుస్తోంది.
‘క’ మూవీ మీకు నచ్చకపోతే కచ్చితంగా నేను సినిమాలు మానేస్తాను. బెట్ చేసి చెబుతున్న, కచ్చితంగా సినిమాల నుంచి తప్పుకుంటాను అంటూ కిరణ్ అబ్బవరం ఛాలెంజ్ చేశాడు. ఈ సినిమా కోసం తాము ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంతా పెట్టాము. అయితే ఓ వైపు పెద్ద బ్యానర్ నుంచి సినిమాలొస్తున్నాయి. దుల్కర్, శివకార్తికేయన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
వీటితో పోటీ అవసరమా అని చాలా మంది అడుగుతున్నారు. నాకు వారితో పోటీ పడాలని లేదు. కానీ రిలీజ్ చేయక తప్పలేదు. ఇంత పోటీ మధ్యలో రిలీజ్ అవుతున్న ఎక్కడో చిన్న హోప్ ఉంది. ఈ విషయాన్ని ఏదో ఆటిట్యూడ్ చూపించడానికి చెప్పడం లేదు. మీ అందరికి కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుందని నమ్మకంతో చెబుతున్న మాట అని ఈవెంట్ లో కిరణ్ మాట్లాడారు.
జాబ్ మానేసి చేతిలో డబ్బులు లేకుండా ఏదైనా సాధించాలనే తపనతో ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి హైదరాబాద్ లో అడుగుపెట్టాను. ఇండస్ట్రీలో నాకు ఎవరు తెలియదు. కానీ షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను. నన్ను అభిమానించే వాళ్ళు ఇక్కడ ఎంత మంది ఉన్నారో నాకు తెలియదు. ప్రతి ఒక్కరికి మాటిస్తున్న.
కచ్చితంగా రెండు, మూడేళ్ళలో మీరందరూ గొప్పగా చెప్పుకునేలా సినిమాలు చేస్తాను అంటూ కిరణ్ ఎమోషనల్ గా చెప్పారు. అలాగే తనపై పనిగట్టుకొని కావాలని కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు నాతో మీకొచ్చిన సమస్య ఏంటి. ఇండస్ట్రీలో కిరణ్ అబ్బవరం రాణించకూడదా… హీరోగా ఎదగకూడదా ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ సీరియస్ అయ్యాడు. ఈ నాలుగేళ్ల కాలంలో మొత్తం ఎనిమిది సినిమాలలో 4 సక్సెస్ అయ్యాయి. ఈ లెక్కన చూసుకుంటే కచ్చితంగా నేను హీరోగా సక్సెస్ అయినట్లే.. అని కిరణ్ వివరణ ఇచ్చారు.