ఇంటెన్స్ లవ్ స్టోరీతో కిరణ్ అబ్బవరం.. 'దిల్‌రూబా' టీజర్ చూశారా?

ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Update: 2025-01-03 13:12 GMT

టాలీవుడ్ లో చాన్నాళ్లుగా సరైన హిట్టు కోసం ఎదురు చూసిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. గతేడాది దీపావళి పండక్కి 'క' మూవీతో బ్లాక్ బస్టర్ విజయం సాధించి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇపుడు ''దిల్‌రూబా'' అంటూ మరో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం మేకర్స్ ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేసారు.

''మ్యాగీ మై ఫస్ట్ లవ్.. మార్చిలో ఎగ్జామ్స్ ఫెయిల్ అయినట్లు మ్యాగీతో లవ్ లో ఫెయిల్ అయ్యాను. అప్పుడే నాకు కింగ్ అండ్ జాన్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయమయ్యారు. వాళ్ళు ఇచ్చిన కౌన్సిలింగ్ తో అమ్మాయిలకి ప్రేమకు చాలా దూరంగా ఉన్నాను. కానీ మార్చి పోతే సెప్టెంబర్ వచ్చినట్లు, నా లైఫ్ లోకి అంజలి వచ్చింది'' అంటూ కిరణ్ అబ్బవరం తన లవ్ స్టోరీని చెప్పడంతో ''దిల్‌రూబా'' టీజర్ ప్రారంభం అవుతుంది. మొదట్లో మ్యాగీ అనే అమ్మాయిని ప్రేమించిన సిద్దార్థ్ (కిరణ్).. బ్రేకప్ అయిన తర్వాత సిగరెట్, మందు అలవాటు చేసుకొని అమ్మాయిలకి దూరంగా ఉంటూ వచ్చాడని అర్థమవుతోంది. అయితే అతడి జీవితంలోకి అంజలి(రుక్సర్ థిల్లాన్) అనే మరో యువతి ప్రవేశించిన తర్వాత అంతా మారిపోయినట్లు తెలుస్తోంది.

కాలేజ్ లో రుక్సార్ థిల్లాన్ తో కిరణ్ కు పరిచయం, ఇద్దరు కలిసి తిరగడం, వారి మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో ఈ టీజర్ సాగింది. ''నా చేతిలో గన్ను ఉంటే కాల్చిపడదొబ్బే వాడిని తెలుసా'' అని కిరణ్ అంటే.. ''రేపు తీసుకొస్తాను, వేసేయ్'' అని రుక్సర్ చెప్పడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అయితే కిరణ్ కి ఉన్న యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ వల్ల అతని లైఫ్ లో కొన్ని అనుకోని సంఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. హీరోయిన్ ని పిచ్చిగా ప్రేమించినప్పటికీ, కోపాన్ని అదుపులో ఉంచుకోకవడం వల్ల హీరో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినట్లు టీజర్ చూస్తే అనిపిస్తుంది. చివర్లో ''ప్రేమ చాలా గొప్పది. కానీ అది ఇచ్చే బాధే చాలా భయంకరంగా ఉంటుంది'' అని కిరణ్ చెప్పే డైలాగ్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది.

'హిజ్ యాంగ‌ర్‌.. హిజ్ ల‌వ్‌' అనే ట్యాగ్ లైన్ కు తగ్గట్టుగానే హీరో ప్రేమను, కోపాన్ని ''దిల్‌రూబా'' టీజర్ లో ప్రధానంగా ఆవిష్కరించారు. ఇందులో యాక్షన్ పాళ్ళు కాస్త ఎక్కువే అనే విషయం అర్థమవుతోంది. కిరణ్ అబ్బవరం స్టైలిష్ మేకోవర్ తో కనిపించాడు. ఇంటెన్స్ యాక్షన్ తో, ఫైట్స్ తో ఆకట్టుకున్నాడు. రుక్సార్ థిల్లాన్ చాలా అందంగా కనిపించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. నజియా డేవిసన్, సత్య, ఆడుకాలమ్ నరేన్, తులసి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. డీఓపీ విశ్వాస్ డేనియల్ విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. బీచ్ ఒడ్డున అందమైన లొకేషన్స్ ను చాలా బాగా కెమెరాలో బంధించారు. ఇక సామ్ సీఎస్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. 'కన్నా నీ ప్రేమ సంద్రమే.. నేను నీ తీరమే.. నేను నీ దేహమే.. ప్రేమకే నీ ప్రేమకే ఈ యుద్ధమే' అంటూ టీజర్ ఆద్యంతం బ్యాగ్రౌండ్ లో వినిపించే పాట స్పెషల్ గా అనిపిస్తుంది.

ఓవరాల్ గా ఇంటెన్స్ లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన 'దిల్‌రూబా' టీజర్ ఆకట్టుకుంటోంది. ''లవ్ లో ఉన్న వాళ్ళ కోసమే కాదు.. బ్రేకప్ అయిన వాళ్ల కోసం కూడా'' అని కిరణ్ అబ్బవరం చెప్పినట్లు యూత్ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. 'అర్జున్ రెడ్డి' దగ్గర నుంచి 'గేమ్ ఛేంజర్' వరకూ అనేక చిత్రాల్లో హీరో యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ మీద స్టోరీ నడిపించారు. ఇప్పుడు అదే తరహాలో 'దిల్‌ రూబా' మూవీలో హీరోకి ఉన్న లవ్ అండ్ యాంగర్ ని చూపించబోతున్నారు. మరి ఈ సినిమా కిరణ్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

''దిల్‌రూబా'' చిత్రాన్ని సరిగమ, శివమ్ సెల్యులాయిడ్స్ సమర్పణలో యోడ్లీ బ్యానర్ లో రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. కేఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, సుధీర్ మాచర్ల ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని 2025 ఫిబ్రవరిలో రిలీజ్‌‌ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎక్కువ శాతం మహాశివరాత్రి స్పెషల్ గా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.


Full View


Tags:    

Similar News