అలా జరిగితే నేనింక సినిమాలే చేయను: కిరణ్‌ అబ్బవరం

కంటెంట్ నచ్చి ఈ సినిమాతో నిర్మాతగా మారిన కిరణ్.. ఈసారి కచ్చితంగా సక్సెస్ అందుతుందనే నమ్మకంతో ఉన్నారు.

Update: 2024-10-26 11:15 GMT

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ''క'' (KA). సుజిత్‌ & సందీప్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తన్వీ రామ్‌ హీరోయిన్ గా నటించింది. టైటిల్ అండ్ ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా.. దీపావళి కానుకగా థియేటర్లలోకి రాబోతోంది. అక్టోబర్‌ 31న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. కంటెంట్ నచ్చి ఈ సినిమాతో నిర్మాతగా మారిన కిరణ్.. ఈసారి కచ్చితంగా సక్సెస్ అందుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇంతకముందు ఏ సినిమా రాలేదని.. ఒకవేళ ఈ సినిమాలోని పాయింట్ ఎక్కడైనా టచ్ అయిందని అనిపిస్తే సినిమాలు మానేస్తానని అన్నారు.

'క' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హైదరాబాద్ లో చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా మీడియా అడిగే ప్రశ్నలకు హీరో కిరణ్ అబ్బవరం ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. 'ట్రైలర్ చూసిన తర్వాత ఇదొక మిస్టిక్ థ్రిల్లర్ అనిపించింది. విరూపాక్ష, కాంతార లేదా మరేదైనా ఇతర థ్రిల్లర్ సినిమాతో ఏమైనా పోలికలు ఉన్నాయా?' అని ప్రశ్నించగా.. ఇది పూర్తిగా కొత్త పాయింట్ తో తీసిన సినిమా అని, ఇతర చిత్రాలకు పోలికపెట్టే అవసరం రాదని చెప్పారు. ''100 శాతం వేరే సినిమాతో కంపేరిజన్ రాదు. సినిమాలో మేము డిస్కస్ చేసిన పాయింట్ ఎక్కడైనా టచ్ అయినట్లు అనిపించినా.. ఇదేంటి అనిపించినా.. నేను ఇంకో సినిమా తీయను. టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వను కానీ, ఆ పాయింట్ వేరే ఎక్కడైనా కనిపించినట్లు ఉంటే.. నేను ఇంక సినిమాలే చేయను'' అని కిరణ్ నవ్వుతూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసారు. ఇది సినిమా మీదున్న అతని నమ్మకాన్ని తెలియజేస్తోంది.

ప్రేక్షకులకు ఎప్పుడూ విభిన్నమైన కథలు అందించాలని ప్రయత్నిస్తుంటానని, ఇందులో భాగంగా చేసిన చిత్రమే 'క' అని కిరణ్ అబ్బవరం తెలిపారు. సినిమాలో తప్పకుండా తనను కొత్తగా చూస్తారని చెప్తూ.. కథేంటి అనేది సింపుల్ గా చెప్పారు. సినిమాలో హీరో అభినవ్ వాసుదేవ్ పాత్ర ఒక అనాధ. పక్కవారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం వాడికి ఎక్కువగా ఉంటుంది. పక్కనోళ్ళ ఉత్తరాలు చదివే క్యూరియాసిటీ పెరగడంతో పోస్ట్ మ్యాన్ అవుతాడు. అతను క్రిష్ణగిరి అనే ఊరికి వెళ్లిన తర్వాత ఏం జరిగింది అనేదే ఈ కథ. ఇదే ఫస్టాఫ్ అంటూ స్టోరీ లైన్ రివీల్ చేసారు.

కథ విన్నప్పుడు చివరి 20 నిమిషాలు తనకు ఎంతగానో ఆకట్టుకుందని, ఇప్పటివరకూ చెప్పని ఒక కొత్త ఎమోషన్‌ని ఈ కథతో తెలియజేస్తున్నామని కిరణ్ చెప్పారు. ప్రేక్షకులు తప్పకుండా ఆశ్చర్యానికి గురవుతారని, ఇది పూర్తిగా కంటెంట్‌ మీద నడిచే సినిమా అని, ప్రతిక్షణం ఉత్కంఠగా సాగుతుందని తెలిపారు. ఇది టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో సాగే సినిమా కాదని యువ హీరో క్లారిటీ ఇచ్చారు. వాసుదేవ్‌ అనే వ్యక్తి ప్రయాణంపై నడిచే కథ ఇదని, డైరెక్టర్స్ స్క్రీన్‌ప్లే అద్భుతంగా తీర్చిదిద్దారని అన్నారు. ట్రైలర్ లో నైట్‌ షాట్స్‌ ఎక్కువగా ఉండటం వల్ల ‘కాంతార’ ఫ్లేవర్‌ తో ఉన్నట్లు అనిపించి ఉండొచ్చని అన్నారు. ఇది సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మాత్రమేనని, ఎలాంటి భక్తి సంబంధమైన విషయాలు ఉండవని స్పష్టం చేసారు.

అలానే 'క' సినిమాలో తాను డ్యూయల్ రోల్ చేయలేదని కిరణ్ క్లారిటీ ఇచ్చాడు. ట్రైలర్‌లో ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరని అడిగితే.. అది ట్విస్ట్ అని నవ్వేసాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చేయాల‌ని కిరణ్ భావించారు. కానీ దీపావళికి తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతుందని, ఆ రోజు మిగిలిన భాషల్లో విడుదల చేయడం లేదని తెలిపారు. దుల్కర్‌ సల్మాన్‌ మూవీ ఉండటంతో మలయాళంలో రిలీజ్ చేయడం కరెక్ట్‌ కాదనిపించిందని, తమిళంలో మాత్రం థియేటర్స్‌ దొరక లేదని అన్నారు. ముందు ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చితే చాలని.. ఫలితం మీ చేతుల్లోనే ఉందని కిరణ్ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News