ఆ సినిమా నేనెందుకు చేయలేదా అని బాధపడుతున్నా: కిరణ్ అబ్బవరం
ఈ చిత్ర ప్రమోషన్స్ లో కిరణ్ సినిమా గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు.;
క సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు టాలీవుడ్ యంగ్ టాలెంట్ కిరణ్ అబ్బవరం. ఎవరూ ఊహించని క్లైమాక్స్ తో ఆడియన్స్ ను కట్టిపడేసిందా చిత్రం. క తర్వాత కిరణ్ నుంచి వస్తున్న సినిమా దిల్ రూబా. వాస్తవానికి క సినిమా కంటే ముందే దిల్ రూబా సినిమా రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల క ను ముందు రిలీజ్ చేశారు.
ఇప్పుడు దిల్ రూబా రిలీజ్ కు రెడీ అయింది. మార్చి 14న దిల్ రూబా ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వకరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటించగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్ర ప్రమోషన్స్ లో కిరణ్ సినిమా గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు.
అయితే కిరణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా సినిమాలు తీస్తాడనే విషయం తెలిసిందే. క సినిమా కూడా అతని సొంత బ్యానర్ లో రూపొందిన సినిమానే. ఇక అసలు విషయానికొస్తే కిరణ్ ప్రస్తుతం తన సొంత బ్యానర్ లో ఓ సినిమాను రూపొందిస్తున్నాడట. ఆ సినిమా గురించి చాలా ఎగ్జైట్ అవుతున్నాడు కిరణ్.
ఆల్రెడీ ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా సైలెంట్ గా జరుగుతుందని త్వరలోనే అనౌన్స్‌మెంట్ ఉండే అవకాశముందని చెప్పిన కిరణ్, కొన్నాళ్ల కిందట విన్న ఒక కథ తనకు బాగా నచ్చిందని, తన బ్యానర్ లో చేయడానికి బావుంటుందనిపించి దాదాపు ఏడాదిన్నరగా దానిపై వర్క్ చేసి సినిమాను ఓకే చేశామని సెట్స్ పైకి తీసుకెళ్లామని, కానీ మధ్యలో తమ టీమ్ మొత్తం క సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమాకు బ్రేక్ వచ్చిందని తెలిపాడు.
పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం కుప్పంలో తీశారని, తెలుగు, తమిళం, కర్ణాటక అంతా బ్లెండ్ అయిన ఫ్లేవర్ లో సినిమా ఉంటుందని, ఆ కథ తనకు చాలా నచ్చిందని, సినిమాకు సంబంధించిన కొంత ఫుటేజ్ కూడా చూశానని, చాలా బాగా వచ్చిందని చెప్పిన కిరణ్, ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయిందని చెప్పాడు. అంతేకాదు, ఆ సినిమా తానెందుకు చేయలేకపోయానా అని బాధపడుతున్నానని, అంత బాగా ఆ సినిమా కథకు తాను కనెక్ట్ అయ్యానని కిరణ్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని మాత్రం కిరణ్ రివీల్ చేయలేదు.