బాలీవుడ్ (Vs) సౌత్ డిబేట్‌పై దర్శకురాలు కిరణ్ రావు
బాలీవుడ్ దర్శకనిర్మాత కిరణ్ రావు బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమా డిబేట్ గురించి బోల్డ్‌గా చర్చించారు.;
బాలీవుడ్ దర్శకనిర్మాత కిరణ్ రావు బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమా డిబేట్ గురించి బోల్డ్‌గా చర్చించారు. దక్షిణాది చిత్రాలకు కథల్ని ఎంపిక విషయంలో ధైర్యాన్ని ప్రశంసించారు. ఇక్కడ పరిమిత ఆడియెన్ కోసం సాహసోపేతమైన కథల్ని చెప్పేందుకు మేకర్స్ వెనకాడరని విశ్లేషించారు. అదే సమయంలో హిందీ చిత్రసీమలో ప్రతి సినిమా పాన్ ఇండియాలో, ప్రతి రాష్ట్రంలోని డయాస్పోరా కోసం భారీ ఆడియెన్ ను దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీయాల్సి ఉంటుందని అన్నారు.
తాను చాలా మలయాళ చిత్రాలను చూసానని చెప్పిన కిరణ్ రావు, వారు ఎథల ఎంపికలో చాలా ధైర్యంగా వ్యవహరిస్తారని, అది తనను ఆశ్చర్యపరుస్తుందని కిరణ్ రావు అన్నారు. మాలీవుడ్ లో గత సంవత్సరం విడుదలైన `ఉలేరి` చాలా బోల్డ్ కథ. అక్కడ హారర్ థ్రిల్లర్లను అద్భుతంగా తెరకెక్కిస్తారు. మమ్ముట్టి `భ్రమయుగం` చూశాను. ఇది కేరళ జానపద కథల ఆధారంగా చాలా కళాత్మకంగా తెరకెక్కించిన సినిమా. ఇది చాలా భిన్నమైన ఆలోచన. వైవిధ్యమైన కథలను చెప్పడంలో ఒక రకమైన దృఢ నిశ్చయం ఉంది. అదే వారిని గొప్ప స్థానంలో నిలిపిందని నేను భావిస్తున్నానని కిరణ్ రావు తెలిపారు.
దక్షిణాది సినిమా కథలు పరిమిత ఆడియెన్ కోసం ఎంపిక చేసినవి అని, దానితో పోలిస్తే హిందీ చిత్రసీమలో కథల్ని డయాస్పోరా కోసం చెప్పాల్సి ఉంటుందని కిరణ్ రావు అభిప్రాయపడ్డారు. దక్షిణాదిన చేసినన్ని ప్రయోగాలు ఉత్తరాదిలో చేయడం వీలుపడలేదని అన్నారు. దక్షిణాదిన ప్రేక్షకులను అర్థం చేసుకుని మేకర్స్ కథలు రాస్తున్నారని అన్నారు. కథలను చెప్పడానికి అవకాశాలను తీసుకుంటున్నారని, సమాజంలోని సంస్కృతి, భాష వంటివి స్థానికతను ప్రభావితం చేస్తాయని... వాటిని సమర్థంగా దక్షిణాది ఉపయోగించుకుంటుంది కాబట్టి వారు విభిన్నమైనవాటిని ప్రయత్నించడానికి భయపడరని విశ్లేషించారు.
ప్రేక్షకుల పల్స్ తెలుసుకుని దర్శకనిర్మాతలు కొత్త కథ చెప్పడంలో అవకాశాలను తీసుకుంటున్నారు. అయితే బాలీవుడ్ చాలా పెద్దది. అతి భారీ ఆడియెన్ కోసం ఇక్కడ సినిమాలు తీయాల్సి ఉంటుంది.. అని అన్నారు. హిందీ పరిశ్రమలో దేశంలోని అన్ని రాష్ట్రాల కోసం సినిమాలు తీస్తున్నారు. అందుకే కచ్ఛితంగా విజయం సాధిస్తుందని భావించే సినిమాను తీయాలని కోరుకోవడం ఒత్తిడిని పెంచుతుంది. బహుశా అందుకే రీమేక్ లాంటి విజయవంతమైన సినిమాను తీయాలనే ధోరణి ఉంది అని కిరణ్ రావు విశ్లేషించారు.
అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన `లగాన్`తో కిరణ్ రావు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కిరణ్ రావు కెరీర్‌ను ప్రారంభించారు. తరువాత `స్వదేస్: వి, ది పీపుల్`కి సహాయ దర్శకురాలిగా పని చేసారు. లగాన్ విదేశీ భాషా చిత్రం విభాగంలో 74వ అకాడమీ అవార్డుకు నామినేట్ అయింది. అమీర్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించి నటించారు. `లగాన్`కు ముందు `దిల్ చాహ్తా హై`లో సహాయ నటిగా ఒక చిన్న పాత్రను కూడా పోషించింది. ఆమె ధోబీ ఘాట్ (2011), లాపాటా లేడీస్ (2024) చిత్రాలకు దర్శకత్వం వహించింది. లాపాటా లేడీస్ ఆస్కార్ పోటీబరిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ పురస్కారాన్ని దక్కించుకోవడంలో తడబడింది.