దేవర-2.. బాహుబలి-2లా అవుతుందా?
దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘దేవర’ సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి దిగింది.
దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘దేవర’ సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి దిగింది. గురువారం అర్ధరాత్రి నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ స్పెషల్ షోలు పడిపోయాయి. యుఎస్ ప్రిమియర్స్ టైంకే ఇక్కడ కూడా ప్రేక్షకులు షో చూసేశారు.
తెల్లవారుజాము సమయానికే టాక్ బయటికి వచ్చేసింది. సినిమా సూపర్ అనట్లేదు. అలా అని బాలేదు అని కూడా అన్నట్లేదు. టాక్ మధ్య స్థాయిలో ఉంది. ఓపెనింగ్స్ వరకు అయితే ‘దేవర’కు ఢోకా లేదు. సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల విశ్లేషణలు కనిపిస్తున్నాయి. చాలామంది ఈ సినిమాకు, బాహుబలికి పోలిక పెడుతుండడం గమనార్హం.
అందులో మాదిరే హీరో తండ్రీ కొడుకులుగా కనిపించాడు. అక్కడ సవతి సోదరుడు హీరోను చంపితే.. ఇక్కడ స్నేహితుడు ఆ పని చేస్తాడు. హీరో కొడుకకు తండ్రి వారసత్వాన్ని కొనసాగించడం.. విలన్ని ఢీకొనడం కథాంశంగా సాగింది. సినిమా చివర్లో పార్ట్-2కు లీడ్‌గా చూపించిన సీన్ ‘బాహుబలి’తో మరింతగా పోలికలు పెట్టడానికి కారణమైంది. ‘దేవర’ను ఎవరు చంపారన్నది ఆ సన్నివేశంలో చూపించారు. ఆ చంపిన వ్యక్తి ఎవరో తెలిసి ప్రేక్షకులు కొంచెం షాకవుతారు.
ఆ వ్యక్తి దేవరను ఎందుకు చంపాడన్న ఆసక్తితో పార్ట్-2 కోసం వెయిట్ చేసేలా సినిమాను ముగించాడు కొరటాల. దీంతో ‘వై కట్టప్ప కిల్డ్ బాహుబలి’ తరహాలోనే ఇక్కడ దేవరను ఆ వ్యక్తి ఎందుకు చంపాడనే ప్రశ్నతో ప్రేక్షకులు ఊగిపోతారని కొరటాల ఆశించవచ్చు. ఐతే ‘బాహుబలి’ మాదిరి ఇక్కడ షాకయ్యే పరిస్థితి అయితే లేదు. ముందు ‘దేవర’కు ఎలాంటి ఫలితం వస్తుంది అన్నదాన్ని బట్టి ఈ ప్రశ్న పార్ట్-2 మీద హైప్ పెంచడానికి ఎంతమేర ఉపయోగపడుతుందని అన్నది తేలుతుంది.