అప్పుడలా..ఇప్పుడిలా ఏంది సాబ్!
క్రిష్ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సోల్ ఉన్న స్టోరీలు రాయడంలో ఆయన దిట్ట.
క్రిష్ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సోల్ ఉన్న స్టోరీలు రాయడంలో ఆయన దిట్ట. అందుకే `వేదం`.. `గమ్యం`..`కంచె` లాంటి గొప్ప సినిమాలు ఆయన నుంచి రాగలిగాయి. క్రియేటివ్ డైరెక్టర్ గా మార్కెట్ లో పాపులర్ అయ్యారు. తనలో ఆ ప్రతిభను చూసే నటసింహ బాలకృష్ణ స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టారు. అటుపై `గౌతమీపుత్ర శాతకర్ణి` లాంటి చారిత్రాత్మక కథతోనూ మరో ప్రయోగం చేయగలిగారు. ఇదంతా క్రిష్ కి ఒకవైపు అయితే? ఆయనని మరోవైపు చూడాల్సిన కోణం కూడా మరోటి ఉంది.
`గబ్బర్ ఈజ్ బ్యాక్` తో బాలీవుడ్ లో నూ దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. క్రిష్ లో ఇవన్నీ చూసే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పిలిచి మరీ తన సినిమా `మణికర్ణిక` ని డైరెక్ట్ చేయమంది. ఇక ఆ సినిమా సంగం షూటింగ్ చేసిన తర్వాత క్రిష్ బయటకు వచ్చేయడం... అటుపై కంగన కెప్టెన్ కుర్చీ ఎక్కడం సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతోనే క్రిష్ వైదొలగాల్సి వచ్చిందన్నది బాలీవుడ్ లో అప్పుడు వెలుగులోకి వచ్చిన వార్త.
దీంతో క్రిష్ కి తొలిసారి భంగపాటు ఎదురైనట్లు అయింది. అంత గొప్ప దర్శకుడు తప్పుకోవడం ఏంటని బాలీవుడ్..టాలీవుడ్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. మరి ఆసలు ఏం జరిగింది? అన్నది వాళ్లిద్దరికే తెలియాలి. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా `హరి హర వీరమల్లు` విషయంలో కూడా అలాంటి క్రియేటివ్ డిఫరెన్సెస్ తలేత్తాయా? అన్న సందేహం రావడం సహజమే. ఈ సినిమాకి తొలుత క్రిష్ ఒక్కడే దర్శకుడిగా తెరపైకి వచ్చారు. కానీ తాజాగా రిలీజ్ అయిన టీజర్ తో క్రిష్ తో పాటు జ్యోతికృష్ణ పేరు కూడా దర్శకుడిగా వేసిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రం మిగిలిన షూటింగ్ ను, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జ్యోతికృష్ణ పూర్తి చేస్తారని ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా క్రిష్ పర్యవేక్షణలో జ్యోతికృష్ణ చేస్తారని క్లారిటీ ఇచ్చారు. సినిమా పూర్తి చేయడంలో ఊహించని జాప్యం జరిగిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారన్నది చిత్ర వర్గాల వెర్షన్. దీని గురించి క్రిష్ మాత్రం ఎలాంటి కామెంట్ చేయలేదు. షూటింగ్ డిలే అవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్. ఆయన రాజకీయంగా బిజీ అవ్వడంతో వీరమల్లుని పక్కనబెట్టారు. దీంతో అతడితో లాభం లేదనుకున్న క్రిష్ కొత్త ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించారన్నది మరో సమాచారం.
ఇదే నిజమా? లేక పవన్ తో కూడా క్రియేటివ్ పరంగా డిఫరెన్స్ వచ్చాయా? అన్నది మరో డౌట్. ఒకవేళ అలా జరిగితే ఇప్పుడు క్రిష్ పేరే వేయరు కదా? అన్నది మరికొంత మంది వాదన. మరి అసలు కారణాలు ఎంటి? అన్నది తెలియాలి. ఏది ఏమైనా క్రిష్ ని పక్కనబెట్టి మరో దర్శకుడిని తెరపైకి తేవడం అన్నది క్రిష్ అభిమానులు జీర్ణించు కోలేకపోతున్నారు. ఈ సినిమా కథ...కథనం రాసింది కూడా క్రిషే. మరి ఆయన కథలో జ్యోతికృష్ణ ఫింగరింగ్ ఏంటో క్లారిటీ రావాలి. అలాగే మణికర్ణిక స్టోరీ..స్క్రీన్ ప్లే రాసింది విజయేంద్ర ప్రసాద్ అన్న సంగతి తెలిసిందే.