క్రిష్4 లేట్‌కు కారణమదే
అయితే క్రిష్3 రిలీజై ఇప్పటికే పదేళ్లు దాటిపోయింది. కానీ ఇంకా ఆ సినిమా పట్టాలెక్కలేదు.
కహో నా ప్యార్ హై సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన హృతిక్ రోషన్ మొదటి సినిమాతోనే సూపర్ స్టార్ లెవెల్ లోకి వెళ్లాడు. ఆ రేంజ్ లో కహో నా ప్యార్ హై ఆడింది. కానీ తర్వాత మాత్రం వరుస ఫ్లాపులు ఆయన్ని వెంటాడాయి. ఫ్లాపుల నుంచి కొడుకును బయటకు తీసుకురావడానికి మరోసారి హృతిక్ తండ్రి రోషన్ రంగంలోకి దిగాడు.
హృతిక్ రోషన్ హీరోగా కోయి మిల్ గయా సినిమాను తీసి రాకేష్ రోషన్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దేశంలో సీక్వెల్స్ కు అంతగా క్రేజ్ లేని రోజుల్లోనే రాకేష్ రోషన్ కోయీ మిల్ గయా సినిమాకు సీక్వెల్ గా క్రిష్, క్రిష్3 సినిమాలను తీసి బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. క్రిష్3 సినిమా టైమ్ లోనే క్రిష్4 కూడా ఉంటుందని అప్పట్లోనే అనౌన్స్ చేశారు.
అయితే క్రిష్3 రిలీజై ఇప్పటికే పదేళ్లు దాటిపోయింది. కానీ ఇంకా ఆ సినిమా పట్టాలెక్కలేదు. క్రిష్4కు సంబంధించిన స్క్రిప్ట్ కూడా ఎప్పుడో రెడీ అయింది. మధ్యలో రాకేష్ కు క్యాన్సర్ సోకడంతో క్రిష్4 ఉంటుందా ఉండదా అనే అనుమానాలొచ్చాయి. కానీ తిరిగి ఆయన కోలుకుని సినిమా తీయడానికి రెడీ అయ్యాడు.
అయినా క్రిష్4 సెట్స్ పైకి వెళ్లడం లేదు. దానికి గల కారణాన్ని ఆయన రీసెంట్ గా వెల్లడించాడు. క్రిష్4 సెట్స్ పైకి వెళ్లకపోవడానికి కారణం బడ్జెట్ సమస్యేనని ఆయన తెలిపాడు. ఆడియన్స్ వరల్డ్ సినిమాను ఎక్కువగా ఆదరిస్తున్న నేపథ్యంలో క్రిష్4ను కూడా అంతర్జాతీయ ప్రమాణాలతోనే తీయాలని, దానికి భారీగా బడ్జెట్ అవసరమవుతుందని, ఆ బడ్జెట్ తో సినిమాను తీయడానికి నిర్మాతలెవరూ ఎవరూ ముందుకు రావడం లేదని రాకేష్ వెల్లడించాడు.
ఇప్పటివరకు క్రిష్ ఫ్రాంచైజ్ లో వచ్చిన గత సినిమాలన్నింటినీ స్వయంగా రాకేష్ తన సొంత బ్యానర్ లో నిర్మించాడు. కానీ క్రిష్4 ను నిర్మించే పరిస్థితుల్లో ఇప్పుడాయన లేనట్టున్నాడు. ఆయన చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఎంతలేదన్నా క్రిష్4ను నిర్మించడానికి రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టాలి. ఆ సినిమాకు ఉన్న క్రేజ్‌కు ఆమాత్రం బడ్జెట్ పెట్టొచ్చు. మరి రాకేష్ ను ఈ విషయంలో ముందుకు నడిపించే నిర్మాతెవరో చూడాలి.