సినిమా హిట్టయినా సంతోషం లేదు

మలయాళ టాప్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో మరో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన సినిమా.. ఎల్-2: ఎంపురాన్.;

Update: 2025-04-01 03:52 GMT
సినిమా హిట్టయినా సంతోషం లేదు

మలయాళ టాప్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో మరో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన సినిమా.. ఎల్-2: ఎంపురాన్. బ్లాక్ బస్టర్ మూవీ ‘లూసిఫర్’కు ఇది సీక్వెల్ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత గురువారం రిలీజైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. వసూళ్లకు ఢోకా లేదు. తొలి రోజు నుంచి మలయాళం ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడుతూ సాగుతోంది. ఇప్పటికే వసూళ్లు రూ.150 కోట్ల మార్కును దాటేశాయి. రూ.200 కోట్ల మార్కును కూడా దాటేసి ఇండస్ట్రీ హిట్ అవడం లాంఛనమే. ఈ రోజు కూడా కేరళలో హౌస్ ఫుల్ వసూళ్లతో నడుస్తోంది ‘ఎంపురాన్’. కానీ ఇంత పెద్ద సక్సెస్ అయినా కూడా చిత్ర బృందంలో ఆనందం లేదు. ఈ సినిమా తీవ్ర వివాదాల్లో చిక్కుకోవడమే అందుక్కారణం.

‘ఎంపురాన్’లో ఆరంభ సన్నివేశాల మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. గోద్రా అల్లర్లను గుర్తు చేసేలా ఉన్న ఈ సన్నివేశాల్లో ముస్లింల మీద హిందూ అతివాదులు పాశవిక దాడి చేసినట్లుగా చూపించారు. దీంతో ‘ఎంపురాన్’ మీద ప్రాపగండా మూవీ అనే ముద్ర పడిపోయింది. దీని మీద దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. వేరే సన్నివేశాల మీద కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ గొడవ చాలా పెద్దదైపోవడంతో చిత్ర బృందం సినిమాలో పలు సన్నివేశాలను కత్తిరించాల్సి వచ్చింది. మోహన్ లాల్ స్వయంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇదంతా దర్శకుడు, రచయిత ప్రమేయం లేకుండానే జరిగినట్లు సమాచారం. ఈ గొడవ చిత్ర బృందంలో తీవ్ర విభేదాలకు దారి తీసినట్లు తెలుస్తోంది.

తన ప్రమేయం లేకుండా తీసిన సన్నివేశాల విషయమై పృథ్వీరాజ్‌తో పాటు రైటర్ మీద మోహన్ లాల్ చాలా కోపంగా ఉన్నాడట. పృథ్వీరాజ్ మీద సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడం, ఇండస్ట్రీలో కూడా చాలా మంది అతణ్ని వ్యతిరేకిస్తుండడంతో పృథ్వీరాజ్ తల్లి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. తన కొడుకుని అందరూ కలిసి బలిపశువును చేశారన్నారు. అందరూ చూశాకే కదా సినిమా రిలీజైంది అని పేర్కొనడం ద్వారా ఇందులో మోహన్ లాల్, నిర్మాతల తప్పూ ఉందని ఆమె ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. మొత్తానికి పరిస్థితి చూస్తుంటే.. ‘ఎంపురాన్’ సినిమా అంత సక్సెస్ అయినా చిత్ర బృందం సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఎంతో సన్నిహితంగా మెలిగే మోహన్ లాల్, పృథ్వీరాజ్‌ల మధ్య ఈ వివాదం చిచ్చు పెట్టినట్లుంది ‘ఎంపురాన్’. ఈ నేపథ్యంలో లూసిఫర్ పార్ట్-3 రావడం సందేహమే.

Tags:    

Similar News