వివాదాల నడుమ పార్ట్‌ 3 ప్రకటన..!

ఎల్‌ 2 సినిమా వివాదం నేపథ్యంలో ఎల్‌ 3 సినిమా ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.;

Update: 2025-04-02 23:30 GMT
వివాదాల నడుమ పార్ట్‌ 3 ప్రకటన..!

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్‌ దర్శకత్వంలో రూపొందిన 'ఎల్‌ 2 : ఎంపురాన్‌' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి పార్ట్‌ లూసీఫర్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో కాస్త ఆలస్యంగా ఎల్‌ 2 అంటూ సీక్వెల్‌ను తీసుకు వచ్చారు. మొదటి పార్ట్‌తో పెద్దగా కనెక్షన్‌ లేకున్నా కొన్ని పాత్రలు కంటిన్యూ కావడంతో సినిమాకు మంచి స్పందన వచ్చింది. లూసీఫర్‌ చూసిన వారు కచ్చితంగా ఎల్‌ 2 సినిమాను ఎంజాయ్ చేస్తారు అనడంలో సందేహం లేదు. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో మొదటి రెండు రోజుల్లోనే ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.

ఒక వైపు ఎల్‌ 2 సినిమా భారీ వసూళ్లు నమోదు చేస్తూ ఉంటే మరో వైపు.. సినిమాలో హిందువులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటూ తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. విలన్‌ను గుజరాత్‌కి చెందిన హిందూ ఉగ్రవాదిగా చూపించడంతో పాటు, జాతీయ స్థాయిలో ముఖ్య నాయకుడిగా ఎదిగినట్లు చూపించడంతో హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయంటూ కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందుత్వ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. సినిమాలోని ఆ సన్నివేశాలను తొలగించాలని కొందరు డిమాండ్‌ చేస్తూ ఉంటే, కొందరు సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ తీరుపై విమర్శలు చేస్తూ, వ్యక్తిగత దాడులకు కూడా పాల్పడేందుకు ప్రయత్నాలు జరిగాయని టాక్‌. వివాదాలు ముదురుతున్న కొద్దీ సినిమాకు వసూళ్లు సైతం అదే స్థాయిలో నమోదు అవుతూ వచ్చాయి. లూసీఫర్‌ సూపర్‌ హిట్‌ అయినప్పటికీ ఎల్‌ 2 కి కాస్త ఎక్కువ సమయం తీసుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్‌ ఎల్‌ 3 కి మాత్రం ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే సీక్వెల్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది. మలయాళ సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఎల్‌ 3 సినిమాను వచ్చే ఏడాదిలోనే పట్టాలెక్కించే విధంగా పృథ్వీరాజ్ సుకుమారన్‌ ప్లాన్‌ చేస్తున్నాడని టాక్.

ఎల్‌ 2 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత, దర్శకుడు సినిమాకు మరో సీక్వెల్‌ ఉంటుంది అంటూ ప్రకటించారు. కనుక ఏ క్షణంలో అయినా ఎల్‌ 3 సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఎల్‌ 2 సినిమాను రీ సెన్సార్‌ చేయించిన కారణంగా వివాదం కాస్త అయినా సర్దుమనిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విలన్ పాత్ర పేరును మార్చడంతో పాటు, చాలా డైలాగ్స్‌ను కట్‌ చేసి, కొన్ని సీన్స్‌లో లోగోను మార్చడం, పాత్రలను కట్‌ చేయడం, కొన్ని సీన్స్‌లోని షాట్స్‌ను మొత్తంగా తొలగించడం వంటివి చేయడంతో వివాదానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టినట్లు అయింది. ఎల్‌ 2 సినిమా వివాదం నేపథ్యంలో ఎల్‌ 3 సినిమా ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. లూసీఫర్‌ను తెలుగులో చిరంజీవి రీమేక్ చేయగా, ఎల్‌ 2 ను డైరెక్ట్‌ తెలుగులో రిలీజ్ చేశారు. ఎల్‌ 3 సైతం రీమేక్ ఉండకుండా తెలుగులో డబ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News