వారి నుంచి ప్రాణహాని ఉంది: లావణ్య సంచలన ఆరోపణలు

టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన లావణ్య – మస్తాన్ సాయి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.

Update: 2025-02-04 07:28 GMT

టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన లావణ్య – మస్తాన్ సాయి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అతనితో పాటు ఖాజా అనే మరో యువకుడిని కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇద్దరూ కలిసి లావణ్యను బెదిరించారని, ఆమెను మానసికంగా వేధించారని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు.

ఈ కేసులో మస్తాన్ సాయి పై బిఎన్ఎస్ యాక్ట్‌లోని 329(4), 324(4), 109, 77, 78 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో మస్తాన్ సాయి వద్ద నుంచి అనేక కీలక ఆధారాలు బయటపడ్డాయి. అతని వద్ద ఉన్న ఒక ల్యాప్‌టాప్, రెండు హార్డ్ డిస్క్‌లు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో 200 కి పైగా ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలే కీలక సాక్ష్యాలు కావడంతో కేసు మరింత ముదురుతోంది.

లావణ్యతో పాటు మరికొంతమంది యువతులను మస్తాన్ సాయి మోసం చేసాడనే ఆరోపణలతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. తాజాగా, లావణ్య నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి, మీడియాతో మాట్లాడారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, గత కొన్ని రోజులుగా తనను బెదిరిస్తున్నట్లు వెల్లడించారు.. ఆమె మాట్లాడుతూ.. నేను ఇచ్చిన ఫిర్యాదుపై స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు పోలీసుల దగ్గరకు వెళ్లాను. కానీ ఇప్పటికీ నాకు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి.

మస్తాన్ సాయి, అతని తల్లిదండ్రులు నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారు. నన్ను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. నా దగ్గర హార్డ్ డిస్క్ ఉందని తెలిసాక, దాన్ని దొంగిలించేందుకు ప్రయత్నించారు. ప్రాణభయం కారణంగా నా జీవితమే కుదుటపడడం లేదు.. అంటూ లావణ్య తెలిపారు. ఇన్నాళ్లుగా తన వద్ద సరైన సాక్ష్యాలు లేకపోవడంతో తాను ఓపిక పట్టానని, కానీ ఇప్పుడు తనకు లభించిన ఆధారాలను పోలీసులకు అందజేశానని తెలిపారు.

ఇక మస్తాన్ సాయి తనపై అనేక కుట్రలు పన్నాడని, ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆమె ఆరోపించారు. తనకు న్యాయం జరగాల్సిందేనని, తాను ఎంత వరకు పోరాడాల్సి వస్తే అంత వరకు పోరాడతానని లావణ్య స్పష్టం చేశారు. ఇక ఈ కేసు మున్ముందు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మస్తాన్ సాయి ఫోన్ నుంచి బయటపడిన డేటా ప్రకారం మరికొంతమందిపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరికొంత మంది ప్రముఖుల వ్యక్తిగత వీడియోలు కూడా ఈ డేటాలో ఉన్నాయని సమాచారం. ఈ కేసులో మరోసారి కొత్త కోణాలు బయటపడే అవకాశముంది. పోలీసుల విచారణను మరింత వేగవంతం చేయాలని, న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని లావణ్య స్పష్టం చేశారు. ఆమె ఆరోపణలతో టాలీవుడ్‌లో ఈ కేసుపై మరింత ఉత్కంఠ నెలకొంది. మరి పోలీసులు ఇంకా ఏ వివరాలు వెల్లడిస్తారో, ఈ కేసు చివరకు ఎటువైపు దారి తీస్తుందో.

Tags:    

Similar News