బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో డేంజరస్ మర్డరర్
తాజా విచారణలో హిట్ లిస్ట్ లో ఓ జైలు ఖైదీ కూడా ఉన్నట్టు సమాచారం.
సల్మాన్ ఖాన్, అతడి కుటుంబాన్ని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు పంజాబీ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్. ఇటీవలే సల్మాన్ స్నేహితుడు, ఎన్సీబీ నాయకుడైన సిద్ధిఖ్ ని అతడి గ్యాంగ్ హతమార్చడం సంచలనమైంది. ఈ కేసులో బిష్ణోయ్ గ్యాంగ్ ని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు వారిని విచారిస్తుంటే షాకిచ్చే నిజాలెన్నో తెలిసొస్తున్నాయి. తాజా విచారణలో హిట్ లిస్ట్ లో ఓ జైలు ఖైదీ కూడా ఉన్నట్టు సమాచారం.
2022 మేలో సంచలనం సృష్టించిన ఓ కేసులో అతడు నిందితుడు. ప్రస్తుతం జైలులో ఉన్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తన లివ్- ఇన్ భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పూనావాలా.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో ఉన్నట్లు ముంబై పోలీసు వర్గాలు తెలపడం కలకలం రేపింది. ఎన్‌సిపి నాయకుడు బాబా సిద్ధిఖ్ హత్యకు సంబంధించిన దర్యాప్తులో పూనావాలా కూడా బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ లిస్ట్ లో ఉన్నట్లు వెల్లడైంది, దీనికి బిష్ణోయ్ ముఠా బాధ్యత వహించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పూనావాలా ఉన్న తీహార్ జైలు అధికారులు నిందితుడి చుట్టూ భద్రతను పెంచినట్లు సమాచారం. అయితే ముంబై పోలీసుల నుంచి తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని జైలు అధికారులు తెలిపారు.
మే 2022లో అఫ్తాబ్ పూనావాలా దిల్లీలో 27 ఏళ్ల శ్రద్ధా వాకర్‌ను గొంతుకోసి, ఆపై ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేసి హత్య చేశాడు. పెళ్లి చేసుకోమని శ్రద్ధ ఒత్తిడి చేయడంతో నిందితుడు ఈ నేరానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పూనావాలా శ్రద్ధా శరీర భాగాలను దాదాపు 20 రోజుల పాటు రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచి దిల్లీలోని మెహ్రౌలీ అడవుల్లోని వివిధ ప్రదేశాలలో వాటిని పారవేసాడని కథనాలొచ్చాయి. నవంబర్ 2022లో శ్రద్ధ తండ్రి మిస్సింగ్ రిపోర్టు దాఖలు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది.
ఎన్.ఐ.ఏ నివేదిక ప్రకారం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తన నేర కార్యకలాపాలలో భాగంగా అనేక మంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంది. ప్రతీకారం, శత్రుత్వం దీనికి మూలాలు. 1998లో కృష్ణజింకను చంపినందుకు బిష్ణోయ్ అతడి గ్యాంగ్ సల్మాన్ ఖాన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్నారు. అతడిని చంపడమే తమ ధ్యేయమని ప్రకటించారు. పలుమార్లు ఎటాక్ లు జరిగాయి.
బిష్ణోయ్ గ్యాంగ్ చేతిలో హత్యకు గురైన పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా మేనేజర్ షగన్‌ప్రీత్ సింగ్ కూడా హిట్ లిస్ట్‌లో ఉన్నారు. ప్రస్తుతం గురుగ్రామ్‌లో ఖైదుగా ఉన్న గ్యాంగ్‌స్టర్ కౌశల్ చౌదరి, ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్ అమిత్ డాగర్ కూడా బిష్ణోయ్ రాడార్‌లోని శత్రువుల జాబితాలో ఉన్నారు.
మోస్ట్ వాంటెడ్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అజేయమైన నేరచరిత్ర వెనక అతడి బలాబలాల్ని తెలుసుకుని తీరాలి. అతడి గ్యాంగ్ 11 రాష్ట్రాల్లో 700 మందికి పైగా షూటర్ల విస్తృత నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. విదేశాలలోను అనుచరులను మెయింటెయిన్ చేస్తున్న చరిత్ర వారికి ఉంది. 200 ఎకరాల ఆస్తిమంతుడు లారెన్స్ బిష్ణోయ్. అతడి సామ్రాజ్యాన్ని పోలీసులు దావూద్ ఇబ్రహీం నేర సామ్రాజ్యంతో పోల్చారు. లారెన్స్ బిష్ణోయ్ అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఖైదీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ గ్యాంగ్‌కు లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్, మరొక పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ నాయకత్వం వహిస్తున్నారు. భవిష్యత్ లో లక్ష్యాలను ఛేధించే పనిలో వారంతా బిజీగా ఉన్నారు.