'లవ్ మి' మూవీ రివ్యూ

Update: 2024-05-25 09:27 GMT

'లవ్ మి' మూవీ రివ్యూ

నటీనటులు: ఆశిష్ రెడ్డి-వైష్ణవి చైతన్య-రవికృష్ణ-సిమ్రన్ చౌదరి-రాజీవ్ కనకాల తదితరులు

సంగీతం: కీరవాణి

ఛాయాగ్రహణం: పీసీ శ్రీరామ్

నిర్మాతలు: హర్షిత్-హన్షిత-నాగ మల్లిడి

రచన-దర్శకత్వం: అరుణ్ భీమవరపు

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కుటుంబం నుంచి హీరోగా పరిచయం అయిన కుర్రాడు ఆశిష్ రెడ్డి. తన తొలి చిత్రం 'రౌడీ బాయ్స్' పర్వాలేదనిపించింది. ఇప్పుడతను 'లవ్ మి' అనే హార్రర్ మూవీలో కథానాయకుడిగా నటించాడు. 'బేబి' ఫేమ్ వైష్ణవి చైతన్య కథానాయికగా చేసిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు అరుణ్ భీమవరపు రూపొందించాడు. ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'లవ్ మి'.. ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం.

కథ: ఆంధ్ర-కర్ణాటక సరిహద్దుల్లోని ఒక ప్రాంతంలో పాడుబడ్డ ఓ అపార్ట్మెంట్లో దివ్యావతి అనే అమ్మాయి దయ్యమై తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో అటు వైపు ఎవ్వరూ వెళ్లరు. ఆ అపార్ట్మెంట్ పాడుబడ్డ స్థితికి చేరుకుంటుంది. ఆ అమ్మాయి సంగతేంటో తెలుసుకుందామని వెళ్లిన వాళ్లంతా అక్కడ శవాలై కనిపిస్తారు. ఇలాంటి సమయంలో దయ్యాలనేవి ఉండవని నమ్మకంతో మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానెల్ నడిపే అర్జున్ (ఆశిష్) ఆ అపార్ట్మెంటుకి వెళ్తాడు. దయ్యంతో స్నేహం చేయాలని అతను తపిస్తాడు. దయ్యం రూపంలో ఉన్న అమ్మాయికి చేరువై తనతో సంభోగిస్తాడు కూడా. కానీ అతడితో కలిసి ఉన్న అమ్మాయి చనిపోయిందని తన స్నేహితుడు నిరూపిస్తాడు. కానీ అర్జున్ ఆ విషయాన్ని నమ్మడానికి ఇష్టపడడు. ఆ అమ్మాయి సంగతేంటో తేల్చాలని పట్టుదలకు వెళ్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిణామాలేంటి.. ఇంతకీ ఆ దయ్యం కథేంటి.. ఈ విషయాలు తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ: రచయితలు.. దర్శకులు ఎంత తెలివైన వాళ్లయినా కావచ్చు.. వాళ్లకు ఎంత వినూత్నమైన ఐడియాలైనా రావచ్చు. కానీ వాళ్ల తెలివినంతా తెర మీద చూపించి ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తే కష్టం. తమ మదిలో మెదిలిన వినూత్నమైన ఐడియాలను ప్రేక్షకులను కన్విన్స్ చేసేలా చెప్పకపోతే మొదటికే మోసం వస్తుంది. '1 నేనొక్కడినే'కు ఇప్పుడు కల్ట్ మూవీ అన్న పేరొచ్చింది కానీ.. థియేటర్లో చూసిన వాళ్లు మాత్రం కథ.. సన్నివేశాలు అర్థం కాక తలలు పట్టుకున్న సంగతి మరువరాదు. '1 నేనొక్కడినే'తో పోల్చదగ్గ కల్ట్ మూవీ 'లవ్ మి' ఎంతమాత్రం కాదు కానీ.. కన్ఫ్యూజన్ డోస్ మాత్రం దాంతో పోలిస్తే ఎన్నో రెట్లు ఉందీ చిత్రంలో. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ అరుణ్ భీమవరపు ఏదో కొత్తగా ఆలోచించి ఒక ఐడియాను తెరపై ప్రెజెంట్ చేయాలని చూశాడు కానీ.. అది ఎంతమాత్రం కన్విన్సింగ్ గా అనిపించక ఇదేం కథ.. ఇదేం క్యారెక్టర్.. ఇదేం సినిమారా బాబోయ్ అని ప్రేక్షకులు తలలు పట్టుకునే పరిస్థితి తలెత్తుతుంది చివరికి. ఎప్పుడూ చూసే సినిమాలకు భిన్నంగా ఉండడం.. అసలు ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ వల్ల సినిమాలో చివరి వరకు కూర్చోగలం కానీ.. చివరికి వెల్లడైన విషయాలు చూశాక మాత్రం ఎంతమాత్రం కన్విన్స్ కాలేం.

'లవ్ మి' ట్రైలర్లో అందరినీ ఆకర్షించిన అంశం.. దయ్యాన్ని హీరో ప్రేమించడం. ఫక్తు హార్రర్ సినిమాలా కనిపించిన 'లవ్ మి'లో ఈ దయ్యం ప్రేమ గుట్టేంటో తెలుసుకుందామని.. ఈ క్రమంలో చిల్స్ అండ్ థ్రిల్స్ తో ఊగిపోవాలని ప్రేక్షకులు థియేటర్లోకి అడుగు పెడతారు. ఐతే మొదట్లో సన్నివేశాలు చూస్తే 'లవ్ మి' మనల్ని తెగ భయపెట్టేస్తుందని.. హార్రర్ ఫ్యాక్టర్ ఒక రేంజిలో ఉంటుందని అనుకుంటాం. కానీ ఆ బిగిని తర్వాత కొనసాగించడంలో దర్శకుడు ఫెయిలయ్యాడు. కొన్ని విజువల్స్.. సౌండ్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతాయి తప్ప.. సన్నివేశాల్లో ఉండాల్సినంత బలం లేకపోవడంతో నెమ్మదిగా ప్రేక్షకులు రిలాక్స్ అయిపోతారు. దయ్యంతో డేట్.. రొమాన్స్ అంటూ హీరోతో చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేయించారు. అవి అంత కన్విన్సింగ్ గా కనిపించవు. ప్రేక్షకులు హీరో రొమాన్స్ చేస్తోంది దయ్యంతో అనుకుంటారు. అదెలా సాధ్యపడుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. హీరో ఏమో తాను రొమాన్స్ చేస్తోంది దయ్యంతో కాదు.. నిజంగా ఓ అమ్మాయితో అనుకుంటాడు. కానీ పడకను కూడా షేర్ చేసుకున్న అమ్మాయి ఎవరన్నది కనిపెట్టడం అంత కష్టమా అన్నది ప్రశ్న. ఇలా కన్విన్సింగ్ గా లేని సన్నివేశాలతో.. కథకు సంబంధించి కన్ఫ్యూజన్ తో 'లవ్ మి' గందరగోళానికి గురి చేస్తుంది. ప్రథమార్ధంలో హార్రర్ ప్రధానంగా సాగే సినిమాలో చిల్ మూమెంట్స్ చాలా తక్కువే.

ఇక ద్వితీయార్దంలో హార్రర్ ఫ్యాక్టర్ పక్కకు పోయి సినిమా థ్రిల్లర్ రూట్ తీసుకుంటుంది. తాను వెతుకుతున్న అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి హీరో చేసే పరిశోధన నేపథ్యంలో కథ నడుస్తుంది. తెర మీద ఏదేదో జరిగిపోతుంటుంది.. పాత్రలు ఏదేదో మాట్లాడుకుంటుంటాయి. కొత్త కొత్త విషయాలు బయటికి వస్తుంటాయి. కానీ అసలేం చెప్పదలుచుకున్నారనే విషయం మాత్రం ప్రేక్షకులకు అర్థం కాదు. తెర మీద పాత్రలు ఇచ్చే బిల్డప్పులు మామూలుగా ఉండవు. కానీ ఏం జరుగుతోందన్నది మాత్రం అర్థం కాదు. చివరికి దయ్యం పాత్రకు సంబంధించి ఇచ్చి ట్విస్ట్ చూసి థ్రిల్ ఫీల్ కావాల్సింది పోయి.. ఇదేం సిల్లీ క్యారెక్టరైజేషన్ అని నవ్వుకోవాల్సిన పరిస్థితి. దర్శకుడి ఐడియా క్రేజీగా అనిపిస్తుంది కానీ.. అది కన్విన్సింగ్ గా తెరపైకి తేవడంలో ఫెయిలయ్యాడు. ఎంతమాత్రం జీర్ణించుకోలేని హీరోయిన్ పాత్ర చిత్రణ.. 'లవ్ మి' మీద ఉన్న ఇంప్రెషన్ అంతా పోగొడుతుంది. మొదట్నుంచి కథను.. సన్నివేశఆలను ఒక వరుస క్రమంలో పేర్చి చూస్తే.. చాలా విషయాలు విడ్డూరంగా అనిపిస్తాయి. తెలుగులో వచ్చిన మోస్ట్ కన్ఫ్యూజింగ్ సినిమాల్లో 'లవ్ మి'ని ఒకటిగా.. మోస్ట్ అన్ కన్విన్సింగ్ పాత్రల్లో ఒకటిగా ఇందులోని హీరోయిన్ క్యారెక్టర్ని చెప్పుకోవచ్చు. మొత్తంగా చెప్పాలంటే 'లవ్ మి' కొత్తదనం పేరుతో చేసిన ఓ వృథా ప్రయాసగా మిగిలిపోతుంది.

నటీనటులు: తొలి సినిమా 'రౌడీ బాయ్స్'లో చలాకీగా నటించి మెప్పించాడు ఆశిష్. రెండో చిత్రంలో కామ్ గా ఉంటూ ఇంటెన్సిటీ చూపించాల్సిన పాత్రలోనూ అతను బాగానే నటించాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ప్రతి సన్నివేశంలో తన కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. అర్జున్ పాత్రకు తగ్గట్లుగా అతను హావభావాలు పలికించాడు. వైష్ణవి చైతన్య కీలకమైన పాత్రలో రాణించింది. బేబి తర్వాత తనది పూర్తి భిన్నమైన పాత్ర. కథలో చాలా వరకు మామూలు అమ్మాయిలా కనిపించి.. చివర్లో షాకిచ్చే క్యారెక్టర్లో ఆమె తన ప్రత్యేకతను చాటుకుంది. రవికృష్ణ సహాయ పాత్రలో ఆకట్టుకున్నాడు. స్కల్ ఆర్టిస్టుగా సిమ్రన్ చౌదరి ఓకే అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఆమె నటన అతిగా అనిపిస్తుంది. రాజీవ్ కనకాల.. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతిక వర్గం: 'లవ్ మి'కి పెద్ద పెద్ద టెక్నీషియన్లే పని చేశారు. వారి స్థాయికి తగ్గ ఔట్ పుట్ మాత్రం కనిపించలేదు. కీరవాణి పాటలు అలా అలా సాగిపోతాయి కానీ.. మళ్లీ వినాలనిపించే స్థాయిలో మాత్రం లేవు. నేపథ్య సంగీతం సినిమా థీమ్ కు తగ్గట్లుగా సాగింది. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం మామూలుగా చూస్తే బాగానే అనిపిస్తాయి. కానీ విజువల్స్ శ్రీరామ్ నుంచి ఇంకా గొప్పగా ఆశిస్తాం. సినిమాలో క్వాలిటీకి ఢోకా లేదు. నిర్మాణ విలువల విషయంలో దిల్ రాజు సంస్థ ఏమాత్రం తగ్గలేదు. రచయిత-దర్శకుడు అరుణ్ భీమవరపు ఒక కొత్త క్రేజీ కాన్సెప్ట్ ను డీల్ చేయాలని చూశాడు. అతను విషయం ఉన్నవాడే అనిపిస్తుంది. అతను స్క్రిప్టు విషయంలో కష్టపడ్డ విషయం తెలుస్తుంది. కానీ ప్రేక్షకులకు అర్థమయ్యేలా కథను తెరపై ప్రెజెంట్ చేయలేకపోయాడు. పాత్రల చిత్రణలోనూ ప్రేక్షకులను కన్విన్స్ చేయలేకపోయాడు. సగటు ప్రేక్షకుడి కోణంలో కథలు విని.. సినిమా చూసి జడ్జ్ చేస్తాడని పేరున్న దిల్ రాజుకు స్క్రిప్ట్ దశలో.. రష్ చూసుకున్నపుడు సందేహాలు రాకపోవడం ఆశ్చర్యం.

చివరగా: లవ్ మి.. అర్థం కా(లే)ని కొత్త కథ

రేటింగ్-2/5

Tags:    

Similar News