'లక్కీ భాస్కర్', 'క', 'అమరన్'.. సోలోగా వచ్చి ఉంటే?
దీపావళికి వచ్చిన 'అమరన్', 'క', 'లక్కీ భాస్కర్' చిత్రాలు బాక్సాఫీస్ కు ఊపిరి పోశాయని చెప్పాలి. వీక్ డేస్ లోనూ మంచి ఆక్యుపెన్సీతో స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి.
దీపావళికి థియేటర్లలోకి వచ్చిన నాలుగు సినిమాలలో మూడు చిత్రాలు మంచి విజయం సాధించాయి. 'లక్కీ భాస్కర్', 'క', 'అమరన్' చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టాయి. ఫస్ట్ వీకెండ్ కే సూపర్ హిట్ దశను క్రాస్ చేసి, బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్నాయి. సోమవారం ఆక్యుపెన్సీ చూస్తుంటే రెండో వారంలోనూ ఈ సినిమాల జోరు ఇలానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇటీవల కాలంలో ఒకే సీజన్ లో రిలీజైన ఏ మూడు సినిమాలకు కూడా యునానిమస్ గా పాజిటివ్ మౌత్ టాక్ రావడం అనేది జరగలేదు. అందరూ పాజిటివ్ రివ్యూలు ఇచ్చిన సందర్భం కూడా లేదు. కానీ 'లక్కీ భాస్కర్', 'క', 'అమరన్' చిత్రాల విషయంలో అలా జరిగింది. ఈ మూడిటికీ దాదాపు అంతా 3/5 రేటింగ్స్ ఇచ్చారు. కంటెంట్ ఉన్న సినిమాలని మెచ్చుకున్నారు. దీనికి తగ్గట్టుగానే ప్రేక్షకాదరణ లభిస్తోంది. సోషల్ మీడియాలో ఈ సినిమాలపై అస్సలు నెగిటివిటీ కనిపించలేదు.
శివకార్తికేయన్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ''అమరన్''. కమల్ హాసన్ నిర్మించిన ఈ ఆర్మీ బ్యాక్ డ్రాప్ సినిమా ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్ సీస్ లో ఇప్పటికే మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిపోయిన్చది. దేశ భక్తి కంటెంట్, సాయి పల్లవి నటన ప్లస్ అవ్వడంతో తెలుగులోనూ ఈ సినిమా ఆడియన్స్ కు ఫస్ట్ ఛాయిస్ గా మారింది. అందుకే వసూళ్ల పరంగా మిగతా రెండు చిత్రాల కంటే కాస్త ముందుంది.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం స్వీయ నిర్మాణంలో రూపొందిన మిస్టిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ''క''. ఈ సినిమా రోజు రోజుకూ వసూళ్లు పెంచుకుంటూ పోయింది. 4 రోజుల్లోనే రూ. 26.52 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఓవర్ సీస్ లోనూ 655K డాలర్లు రాబట్టింది. ఆల్రెడీ అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసి, ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. మరోవైపు దుల్కర్ సల్మాన్ నటించిన 'లక్కీ భాస్కర్' మూవీ వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో 61.4 కోట్లు కలెక్ట్ చేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇది యూఎస్ లో 700K డాలర్లు వసూలు చేసింది.
ఇలా దీపావళికి బాక్సాఫీస్ కళకళ లాడుతోంది. కాకపోతే వీటికి డే బై డే మంచి వసూళ్లు వస్తున్నాయి కానీ, ఒకేసారి సెన్సేషనల్ ఫిగర్స్ ఏమీ రావడం లేదు. దీనికి కారణం మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు ఒకేసారి రావడమే అని తెలుస్తోంది. మూడు సినిమాలూ బాగుండటంతో, కలెక్షన్స్ షేర్ చేసుకోవాల్సి వచ్చిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూడు చిత్రాలు ఒకేసారి కాకుండా, వారానికి ఒకటి చొప్పున వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అంటున్నారు. ఎలాంటి పోటీ లేకుండా సోలోగా రిలీజ్ అయ్యుంటే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించేవని భావిస్తున్నారు.
ఏదేమైనా ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది? ఏది విన్నర్ గా నిలుస్తుంది? అనేది పక్కన పెడితే.. దీపావళికి వచ్చిన 'అమరన్', 'క', 'లక్కీ భాస్కర్' చిత్రాలు బాక్సాఫీస్ కు ఊపిరి పోశాయని చెప్పాలి. వీక్ డేస్ లోనూ మంచి ఆక్యుపెన్సీతో స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. బుక్ మై షోలో మూడింటికీ అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. కాబట్టి నెమ్మదిగా అయినా సరే వారాంతానికి ఈ మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.